మహిళలకు ఎక్కువగా లోన్లు ఇవ్వండి..పేదరిక నిర్మూలనలో బ్యాంకర్ల పాత్ర కీలకం: మంత్రి సీతక్క 

మహిళలకు ఎక్కువగా లోన్లు ఇవ్వండి..పేదరిక నిర్మూలనలో బ్యాంకర్ల పాత్ర కీలకం: మంత్రి సీతక్క 
  • సెర్ప్ 2025– 26 యాక్షన్ ప్లాన్ ఆవిష్కరణ 

హైదరాబాద్, వెలుగు: పేదరిక నిర్మూలనలో బ్యాంకర్ల పాత్ర కీలకమని మంత్రి సీతక్క అన్నారు. మహిళలకు బ్యాంకులు ఇచ్చే రుణం పేదరికంపై రణంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. గతేడాది మహిళా సంఘాలకు లక్ష్యానికి మించి రుణసదుపాయం కల్పించామని, అంతకుముందు ఏడాదితో పోలిస్తే అదనంగా రూ.5 వేల కోట్ల రుణాలు ఇప్పించామన్నారు. ఇది మహిళా సంఘాల చరిత్రలో ఒక రికార్డు అని పేర్కొన్నారు.

గురువారం ప్రజాభవన్ లో సెర్ప్ బ్యాంకు లింకేజీ వార్షిక కార్యాచరణ ప్రణాళిక 2025–-26 ను మంత్రి ఆవిష్కరించారు. స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆర్థిక అక్షరాస్యత సమాచార దీపికను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యాక్షన్ ప్లాన్ కు అనుగుణంగా మహిళా సంఘాలకు రుణ సదుపాయం కల్పించేందుకు బ్యాంకర్ల సహకారం ఉండాలని కోరారు. రుణాలను తిరిగి చెల్లించడంలో మహిళా స్వయం సహాయక బృందాలు తమ నిబద్ధతను చాటుకుంటున్నాయని, 98.5 శాతం లోన్లను రీ పేచేసి రికార్డు సృష్టించాయన్నారు.

మహిళలకు లోన్లు ఇవ్వడంలో బ్యాంకర్లు  మానవీయంగా వ్యవహరించాలని, అప్పుడే అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయన్నారు. ప్రభుత్వాలు, బ్యాంకర్లు స్వయం సహాయక సంఘాలకు అండగా నిలవాలని కోరారు. మహిళా స్వయం సహాయక సంఘాలు స్వయం ఉపాధి నుంచి సంపద సృష్టించే స్థాయికి ఎదిగాయని, కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునే స్థితికి చేరుకోవడం ఆనందంగా ఉందన్నారు. మహిళా సంఘాల్లో కోటి మంది సభ్యులను చేర్చి, వారిని కోటీశ్వరులను చేసే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు.

అనంతరం గతేడాది మహిళా సంఘాలకు లోన్లు ఇవ్వడంలో టార్గెట్ రీచ్ అయిన బ్యాంకర్లను మంత్రి సీతక్క ప్రత్యేకంగా సన్మానించారు. లోన్లు తిరిగి చెల్లిస్తూ ఆర్థిక క్రమశిక్షణ ప్రదర్శిస్తున్న మహిళా స్వయం సహాయక సంఘాలనూ అభినందించారు. కార్యక్రమంలో పీఆర్ ఆర్డీ కార్యదర్శి లోకేశ్ కుమార్, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి, జిల్లా మహిళా సమాఖ్య ప్రతినిధులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.