- ప్రశాంతంగా ముగిసిన మూడో విడత ఎన్నికలు
- మంచిర్యాల జిల్లాలో 87.78 శాతం పోలింగ్
- నిర్మల్‌జిల్లా తానూర్ మండలంలో 90. 28 ఓటింగ్, మంచిర్యాల జిల్లా కోటపల్లిలో 89.65 శాతం..
- ఎన్నికలు ముగియడంతో ఊపిరిపీల్చుకున్న అధికారులు
ఆదిలాబాద్/ఆసిఫాబాద్/మంచిర్యాల/ నిర్మల్, వెలుగు: గ్రామాల్లో ఓట్ల పండుగ ముగిసింది. మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికలకు బుధవారంతో తెరపడింది. 20 రోజులుగా జరుగుతున్న ఎలక్షన్లు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. చివరి విడతలో ఆదిలాబాద్ జిల్లాలో ఆరు మండలాల్లోని 121 గ్రామ పంచాయతీలకు, 1009 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 1,24,880 మంది ఓటర్లకు గాను 1,04,104 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహిళలు 52,507 మంది ఓటేయగా పురుషులు 50,597 మంది ఓటు వేశారు.
మొత్తం 82.56 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా తలమడుగు మండలంలో 86.94 పోలింగ్ జరిగింది. పోలింగ్ సరళిని కలెక్టర్ రాజర్షి షా వెబ్ క్యాస్టింగ్ ద్వారా పరిశీలించారు. గుడిహత్నూర్ మండలంలోని మన్నూర్, నేరడిగొండ , తేజాపూర్, బోథ్, కౌట బి, సొనాల, బజార్ హత్నూర్, తలమడుగు మండలంలోని బరంపూర్ గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. సుకిండి, దేవాపూర్, తలమడుగు, రుయ్యాడి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. మూడో విడతలో 30 గ్రామ పంచాయతీలు, 206 వార్డు స్థానాలను ఏకగ్రీవమయ్యాయి.
ప్రశాంతంగా మూడో విడత
ఆసిఫాబాద్ జిల్లా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి, కాగజ్ నగర్ మండలాల్లో ఉదయం తీవ్రమైన చలిలోనూ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నాయి. నాలుగు మండలాల్లో 104 సర్పంచ్ స్థానాలకు ,744 వార్డులకు పోలింగ్ నిర్వహించారు. మొత్తం 1,21,004 ఓట్లకు గాను 1,00,815 ఓట్లు పొలయ్యాయి. జిల్లాలో 83.32 శాతం పోలింగ్ నమోదు కాగా అత్యధికంగా రెబ్బెన మండలంలో 85.64 పోలింగ్ నమోదైంది. కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అంకుశాపూర్, కోసిని పోలింగ్ కేంద్రాలను కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లాతో కలిసి పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ మోతుగూడ, కోసిని, ఇందిరానగర్, రెబ్బెన, కన్నెపల్లి పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. కౌంటింగ్ రాత్రి వరకు కొనసాగింది.
ప్రశాంతంగా మూడో విడత పంచాయతీ ఎన్నికలు
మంచిర్యాల జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పర్వం ప్రశాంతంగా ముగిసింది. చెన్నూర్ నియోజకవర్గంలోని మందమర్రి, చెన్నూర్, జైపూర్, భీమారం, కోటపల్లి మండలాల్లోని 98 సర్పంచ్ స్థానాలు, 711 వార్డులకు పోలింగ్ జరిగింది. మొత్తం 102 సర్పంచ్ స్థానాలకు గాను 4 ఏకగ్రీవమయ్యాయి. 868 వార్డులకు 153 ఏకగ్రీవం కాగా, నాలుగు వార్డులకు నామినేషన్లు రాలేదు. దీంతో మిగిలిన సర్పంచ్ స్థానాలు, వార్డులకు పోలింగ్ నిర్వహించారు. ప్రజలు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 1,06,889 మంది ఓటర్లకు గాను 93,822 ఓటు వేయగా 87.78 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లా ఎన్నికల అధికారి, కలె క్టర్ కుమార్ దీపక్ జైపూర్ ఇందారం, భీమారంలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు.
నిర్మల్ జిల్లాలో ఓటు హక్కును వినియోగించుకున్న 1,23,278 మంది
నిర్మల్ జిల్లాలోని బాసర, భైంసా, కుభీర్, ముథోల్, తానూర్ మండలాల్లో ఎన్నికల జరిగాయి. ఐదు మండలాల్లో 133 గ్రామపంచాయతీలకు గాను 9 ఏకగ్రీవమవడంతో 124 సర్పంచ్, 1126 వార్డులకు గాను 333 వార్డులు ఏకగ్రీవం కాగా 791 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
రెండు వార్డులకు ఎవరు కూడా నామినేషన్ దాఖలు చేయకపోవడంతో అక్కడ ఎన్నికలు చేపట్టలేదు. మొత్తం 1,45,048 మంది ఓటర్లకు గాను 1, 23,278 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో 62,849 మంది మహిళా ఓటర్లు కాగా 60,427 మంది పురుష ఓటర్లున్నారు. 84.99 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మూడు విడతల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. అధికారులు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిలను గమనించి కావాల్సిన చర్యలు చేపట్టారు.
