- మొత్తంగా అధికారపార్టీ చేతికి 62% పంచాయతీలు
- రెండో స్థానంలో బీఆర్ఎస్.. మూడో స్థానంలో ఇండిపెండెంట్లు.. నాల్గో స్థానంలో బీజేపీ
హైదరాబాద్, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జైత్ర యాత్ర కొనసాగించింది. అన్ని జిల్లాల్లోనూ హస్తం పార్టీ హవా స్పష్టంగా కనిపించింది. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఘనవిజయం సాధించి జోరుమీదున్న అధికార పక్షం.. తాజాగా పంచాయతీ ఎన్నికల్లోనూ ఆధిపత్యాన్ని కనబరిచింది. బుధవారం అర్ధరాత్రి వరకు వచ్చిన తుది విడత ఫలితాలను కలుపుకొని మూడు విడతల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు దాదాపు 62 శాతం గ్రామాల్లో విజయబావుటా ఎగురవేశారు.
ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ మద్దతు దారులు చాలా జిల్లాల్లో పోటీ ఇవ్వలేక చతికిలపడగా.. బీజేపీ ప్రభావం నామమాత్రంగానే కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12,278 పంచాయతీలకుగాను వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన 26 పంచాయతీలను మినహాయిస్తే 12,702 గ్రామ పంచాయతీలకు (ఏకగ్రీవాలను కలుపుకొని) మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకపక్ష విజయాలను నమోదు చేసింది. బుధవారం అర్ధరాత్రి వరకు అందిన తుది ఫలితాలను బట్టి కాంగ్రెస్ ఏకంగా 7,793 స్థానాలను కైవసం చేసుకుంది. ఇది దాదాపు 8 వేలకు చేరే అవకాశం ఉంది.
అనేక గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఆశించి భంగపడిన నాయకులు, రెబల్స్‌గా బరిలోకి దిగి సత్తా చాటారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఈ స్వతంత్ర విజేతలు, రెబల్స్ తమ మద్దతును తిరిగి అధికార పార్టీకే ప్రకటించారు. వీరంతా ఆయా నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి తాము కాంగ్రెస్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. దీంతో రికార్డు స్థాయిలో దాదాపు 62 శాతం గ్రామాల్లో కాంగ్రెస్ పాలకవర్గాలే కొలువుదీరనున్నాయి. ఈ ఫలితాలతో రూరల్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆదరణ మరోసారి రుజువైందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు.
మూడు విడతల్లోనూ ఏకపక్షం.. జిల్లాల్లో ‘డబుల్ సెంచరీ’
ఎన్నికల సరళిని పరిశీలిస్తే.. మొదటి విడత నుంచే కాంగ్రెస్ తన ఆధిక్యతను చాటింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ మద్దతుదారులు గెలుచుకున్న సర్పంచ్ సీట్ల సంఖ్య 'డబుల్ సెంచరీ' (200) దాటడం విశేషం. మొత్తం మూడు విడతల్లో 12,702 పంచాయతీలకు ఎన్నికలు జరగగా (ఏకగ్రీవాలు కలుపుకొని).. కాంగ్రెస్ 7,793 (61.4%) స్థానాల్లో గెలిచి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బీఆర్ఎస్ 3,490 (27.4%) స్థానాలతో రెండో స్థానంలో నిలవగా, బీజేపీ కేవలం 635 (5%) స్థానాలకే పరిమితమైంది. స్వతంత్రులు, ఇతరులు 784 (6%) స్థానాల్లో గెలిచి బీజేపీ కంటే మెరుగైన ఫలితాలను సాధించారు.
- మొదటి విడతలో మొత్తం 4,230 పంచాయతీలకు గాను కాంగ్రెస్ మద్దతుదారులు అత్యధికంగా 2,860 స్థానాలను కైవసం చేసుకున్నారు. బీఆర్ఎస్ మద్దతుదారులు 1,143 స్థానాల్లో గెలవగా, బీజేపీ మద్దతుదారులు 185 స్థానాలను మాత్రమే దక్కించుకోగలిగారు. ఇతరులు 42 చోట్ల గెలిచారు.
- రెండో విడతలో 4,326 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ మద్దతుదారులు 2,431, బీఆర్ఎస్ మద్దతుదారులు 1,187 స్థానాల్లో విజయం సాధించారు.. బీజేపీ మద్దతుదారులు 268 స్థానాల్లో గెలిచారు. అయితే ఇతరులు ఏకంగా 440 స్థానాల్లో గెలిచి బీజేపీని వెనక్కి నెట్టారు.
- మూడో విడతలో మొత్తం 4,146 స్థానాలకు గాను కాంగ్రెస్ మద్దతుదారులు 2,502 స్థానాలతో తమ హవా కొనసాగించారు. బీఆర్ఎస్ మద్దతుదారులు 1,160 స్థానాలు పొందగా, బీజేపీ మద్దతుదారులు మళ్లీ పడిపోయి 182 స్థానాలకే పరిమితమయ్యారు. ఇతరులు 302 స్థానాల్లో విజయం సాధించారు.
రెండేండ్ల పాలనకు జనామోదం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను రేవంత్ రెడ్డి పాలనకు రెఫరెండంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సవాల్ విసిరారు. ఆ సవాల్‌ను స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి, స్వయంగా రంగంలోకి దిగి ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించారు. కాగా, అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి 25 వేల భారీ మెజారిటీతో గెలవడం, ఆ వెంటనే పంచాయతీ ఎన్నికలు రావడం కాంగ్రెస్‌కు కలిసి వచ్చింది. పల్లెల్లో ప్రజలు కేసీఆర్‌కు సానుకూలంగా ఉన్నారని బీఆర్‌ఎస్ చేసిన ప్రచారాన్ని తాజా ఫలితాలు పటాపంచలు చేశాయి.
అర్బన్ ఓటరు మొదలుకొని రూరల్ ఓటరు వరకు అందరూ రేవంత్ పాలనకు జై కొట్టారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. రెండేండ్ల పాలనకు ప్రజలు ఫస్ట్ క్లాస్ మార్కులు వేశారని, సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదని, అందుకు ఈ ఫలితాలే నిదర్శనమని అధికార పార్టీ నేతలు చెప్తున్నారు. సన్నబియ్యం, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, సన్నవడ్ల బోనస్, రైతు రుణమాఫీ, మహాలక్ష్మి తదితర సంక్షేమ పథకాలు కూడా ప్రభుత్వంపై సానుకూలతను పెంచాయని అభిప్రాయపడ్తున్నారు.
