పొల్యూషన్ ఎఫెక్ట్.. ఢిల్లీ బార్డర్లో 9 టోల్ ప్లాజాలు మూసేయండి: ఎన్ హెచ్ఏఐ, ఎంసీడీకి సుప్రీంకోర్టు ఆదేశం

పొల్యూషన్ ఎఫెక్ట్.. ఢిల్లీ బార్డర్లో 9 టోల్ ప్లాజాలు మూసేయండి: ఎన్ హెచ్ఏఐ, ఎంసీడీకి సుప్రీంకోర్టు ఆదేశం
  • జనవరి 31 వరకు ఓపెన్ చేయొద్దు.. లేదా వేరేచోటికి షిఫ్ట్ చేయండి 
  • బీఎస్4, ఆపై వాహనాలనే ఢిల్లీలోకి అనుమతించాలి 
  • మిగతా వెహికల్స్​పై కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు 
  • ఢిల్లీలో ఏటా వింటర్​లో కాలుష్యం పెరుగుతుండటంపై సీరియస్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఏటా చలికాలంలో ఎయిర్ పొల్యూషన్ భారీగా పెరుగుతుండటం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీ-–ఎన్ సీఆర్ పరిధిలోని బార్డర్ లలో ఉన్న 9 టోల్ ప్లాజాల వల్ల కూడా ట్రాఫిక్ జామ్ లు విపరీతంగా పెరుగుతున్నాయని, తద్వారా కాలుష్యం కూడా అధికమవుతోందని స్పష్టం చేసింది. అందుకే ఈ టోల్ ప్లాజాలను తాత్కాలికంగా జనవరి 31వ తేదీ వరకూ మూసేయాలని.. లేదంటే ఇతర ప్రాంతాల్లోకి షిఫ్ట్ అయినా చేయాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్ హెచ్ఏఐ), ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)ని ఆదేశించింది. 

ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ అంశంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ, జస్టిస్ విపుల్ పంచోలీతో కూడిన బెంచ్ బుధవారం విచారించింది. ఏటా చలికాలంలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడం పరిపాటిగా మారిందని, ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ నివారణకు ఏర్పాటైన సీఏక్యూఎం ఇకపై దీర్ఘకాలికమైన, సమర్థమైన వ్యూహాలను రూపొందించాలని సూచించింది. 

పాత పెట్రోల్, డీజిల్ వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. భారత్ స్టేజ్–4(బీఎస్ 4), ఆపై స్థాయి ఇంజన్ లతో కూడిన వాహనాలకు మాత్రమే ఢిల్లీలో తిరిగేందుకు అనుమతి ఇవ్వాలని, అంతకంటే తక్కువ స్థాయి ఇంజన్ లతో కూడిన వాహనాలు ప్రవేశిస్తే జరిమానాలు విధించాలని స్పష్టం చేసింది. 

పాత వాహనాలపై ఉత్తర్వుల సవరణ.. 

పదేండ్లనాటి డీజిల్ వాహనాలు, 15 ఏండ్ల నాటి పెట్రోల్ వాహనాలను ఈ నెల 18 నుంచి బ్యాన్ చేస్తూ సీజేఐ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, ఈ వాహనాలన్నీ బీఎస్3 ఇంజన్లతో తయారయ్యాయి. వీటికంటే మెరుగైన బీఎస్4 ఇంజన్​లు 2017లో లాంచ్ అయ్యాయి. ముందు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం.. పాత వెహికల్స్ (బీఎస్3)కు అనుమతి ఇవ్వడం వల్ల కాలుష్యం విపరీతంగా పెరుగుతోందని, వాటికి మినహాయింపులు ఇవ్వొద్దంటూ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (సీఏక్యూఎం) విజ్ఞప్తి చేయడంతో బెంచ్ ఈ మేరకు తన ఉత్తర్వులను సవరించింది. కేవలం బీఎస్4, ఆపై స్థాయి వాహనాలకు మాత్రమే ఆంక్షల నుంచి 
మినహాయింపును ఇవ్వాలంటూ ఆదేశించింది.