పశ్చిమాసియాలోకి అమెరికా డూమ్స్ డే ఫ్లైట్..అణు యుద్ధ నియంత్రణ విమానం మోహరింపు

పశ్చిమాసియాలోకి అమెరికా డూమ్స్ డే ఫ్లైట్..అణు యుద్ధ నియంత్రణ విమానం మోహరింపు
  • 12 గంటల పాటు ఇంధనం అక్కర్లేదు..
  • అవసరమైతే గాల్లోనే రీఫ్యూయలింగ్ ఏర్పాటు

వాషింగ్టన్: పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత శక్తివంతమైన 'డూమ్స్‌‌‌‌‌‌‌‌డే' అణు కమాండ్ విమానాలను మిడిల్ ఈస్ట్​ పంపాలని నిర్ణయించారు. ఇరాన్ తన క్షిపణి వ్యవస్థలను సిద్ధం చేస్తోందన్న నిఘా వర్గాల సమాచారంతో పాటు, హార్మూజ్ జలసంధిని శత్రువులకు మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించిన తరుణంలో అమెరికా ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. శత్రువులకు గట్టి హెచ్చరికలు పంపడంతో పాటూ అక్కడి తన మిత్రదేశాలకు రక్షణ భరోసా కల్పించడం దీని వెనుకున్న ప్రధాన ఉద్దేశ్యం.

ఈ విమానాల ప్రత్యేకత మరియు సామర్థ్యం

ఈ ‘డూమ్స్‌‌‌‌డే’ విమానాలను అధికారికంగా ఈ-4బీ 'నైట్‌‌‌‌వాచ్' అని పిలుస్తారు, వీటిని తరచుగా ‘ఫ్లయింగ్ పెంటగాన్’ అని కూడా వ్యవహరిస్తారు. భూమిపై ఉన్న కమాండ్ సెంటర్లు అణు దాడిలో ధ్వంసమైనా సరే..  అమెరికా అధ్యక్షుడు తన సైన్యాన్ని మరియు అణు క్షిపణులను ఆపరేట్ చేసే ఏర్పాట్లు ఇందులో ఉన్నాయి. రేడియేషన్, విద్యుదయస్కాంత పల్స్ దాడులను కూడా తట్టుకునేలా ఈ విమానాలను రూపొందించారు. ఒక్కసారి గాల్లోకి ఎగిరాక నిరంతరాయంగా 12 గంటల పాటు ఇది ఆకాశంలో చక్కర్లు కొట్టగలదు. అవసరాన్ని బట్టి గాల్లోనే ఇంధనం నింపుకునే 
సామర్థ్యం కూడా దీనికి ఉంది.

యుద్ధ మేఘాల మధ్య  మోహరింపు

ప్రస్తుతం అమెరికాకు చెందిన విమాన వాహక నౌకలు, యుద్ధ విమానాలతో పాటు, ఈ అణు కమాండ్ విమానాలు కూడా పశ్చిమాసియా గగనతలంలో గస్తీ ముమ్మరం చేశాయి. అణు యుద్ధం 
వచ్చే అవకాశం తక్కువే అయినా ఇరాన్ చేస్తున్న ప్రకటనలు, చర్యల దృష్ట్యా ట్రంప్ పరిపాలన 
‘అత్యున్నత స్థాయి హెచ్చరిక’ జారీ చేసింది.

కాలిఫోర్నియా గగనతలంపై.. 

‘డూమ్స్‌‌‌‌డే’ విమానం మరోసారి అమెరికా గగనతలంలో చక్కర్లు కొడుతూ కనిపించింది. కాలిఫోర్నియా రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా అత్యంత రహస్యంగా సాగే ఈ విమానాల కదలికలు ఇప్పుడు బహిర్గతం కావడం అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుంది.

అణు యుద్ధం వంటి అత్యవసర పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు, ఉన్నత స్థాయి రక్షణ అధికారులకు గాలిలోనే ఉండి దేశాన్ని నడిపించే సామర్థ్యం ఈ విమానానికి ఉంది. ప్రస్తుతం ఇరాన్,  ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు తీవ్రమవుతుండటం, హార్మూజ్​ జలసంధి మూసివేత వంటి హెచ్చరికలతో, అమెరికా తన అణు కమాండ్ వ్యవస్థలను అత్యున్నత అప్రమత్తతలో ఉంచినట్లు ఈ విమాన ప్రయాణం సూచిస్తోంది.