- ఈ నెలాఖరులోగా చెల్లించకుంటే ఏప్రిల్1 నుంచి సమ్మె: ఎన్ హెచ్ఎం ఉద్యోగులు
హైదరాబాద్, వెలుగు: గత ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డాక్టర్ల నుంచి అటెండర్ల దాకా చిత్తశుద్ధితో వైద్య సేవలు అందిస్తున్న తమను ప్రభుత్వం విస్మరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నెలల తరబడి వేతనాలు రాక పేద, మధ్యతరగతి ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోయారు.
గతంలో మంత్రి దామోదర రాజనర్సింహాను, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ను కలిసి జీతాలు చెల్లించాలని విన్నవించుకున్నా.. ఫలితం లేకుండా పోయిందని గుర్తుచేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్న తమ కష్టాన్ని ప్రభుత్వం గుర్తించాలని కోరారు. మార్చి 31వ తేదీలోగా తమ బకాయిలను క్లియర్ చేయకపోతే గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగుతామని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.
