నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
  • ‘అనిమేష’ కవితా సంపుటికి దక్కిన అత్యున్నత పురస్కారం 
  • సీఎం రేవంత్, మంత్రి జూపల్లి, కేసీఆర్, కేటీఆర్, హరీశ్, ఇతర ప్రముఖుల అభినందనలు

హైదరాబాద్, వెలుగు: ప్రముఖ కవి, రచయిత డాక్టర్ నందిని సిధారెడ్డికి దేశంలోనే అత్యున్నత సాహిత్య పురస్కారమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. ఆయన రాసిన ‘అనిమేష’ వచన కవితా సంపుటికి ఈ  పురస్కారం లభించింది. 

అనిమేష కవితా సంపుటి కొవిడ్ నాటి చీకటి రోజులను ప్రతిబింబిస్తుంది. ప్రపంచమంతా నాలుగు గోడల మధ్య బందీ అయిన వేళ మనుషులు అనుభవించిన వేదన, మరణ మృదంగం సృష్టించిన భయం, సామాజిక సంబంధాల్లో వచ్చిన మార్పులను ఆయన ఈ సంపుటిలో వివరించారు.

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారం గ్రామంలో జన్మించిన నందిని సిధారెడ్డి తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలు చేశారు. హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ పూర్తిచేసి.. ‘ఆధునిక తెలుగు కవిత్వంలో సూర్యుడు' అనే అంశంపై ఎంఫిల్ పట్టా పొందారు. ఆ తర్వాత ‘ఆధునిక కవిత్వం, వాస్తవికత, అధి వాస్తవికత’పై పరిశోధన చేసి పీహెచ్​డీ పట్టా తీసుకున్నారు. మెదక్​ లో కొంతకాలం పనిచేసి తర్వాత సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్ పనిచేసి 2012లో పదవీవిరమణ చేశారు. 

మంజీరా రచయితల సంఘం స్థాపించి ఎందరో వర్ధమాన కవులను, రచయితలను ప్రోత్సహించారు. సాహిత్యానికి ప్రాంతీయతను జోడించడంలో ఆయనది ప్రత్యేక శైలి. ‘మంజీర’ బులెటిన్ కు, సోయి పత్రికకు సంపాదకత్వం వహించారు. 2001లో తెలంగాణ రచయితల వేదికకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించారు. ‘నాగేటి చాలల్లో నా తెలంగాణ’ వంటి పాటలు ఉద్యమానికి ఊపిరి పోశాయి. ‘పోరు తెలంగాణ’ సినిమాలో ఈ పాటను వాడుకోగా దానికి నంది అవార్డు వచ్చింది.

ఎన్నో పురస్కారాలు 
తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర సాహిత్య అకాడమీకి తొలి చైర్మన్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించి రాష్ట్ర సాహిత్య వైభవాన్ని చాటిచెప్పారు. తన కలం ద్వారా తెలంగాణ సంస్కృతి, ఆత్మ, జీవన విధానాలను ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన రచనలు తెలంగాణ జీవితం, ప్రజల సమస్యలు, ఉద్యమాలను ప్రతిబింబిస్తాయి. ఆయన భూమిస్వప్నం, సంభాషణ, ఆధునిక తెలుగుకవిత్వం– వాస్తవికత – అధివాస్తవికత (సిద్ధాంతగ్రంథం), దివిటీ, ప్రాణహిత, ఒక బాధ కాదు, నది పుట్టుబడి, ఇగురం, ఆవర్థనం, నాగేటి చాల్లల్ల (పాటలు), ఇక్కడి చెట్లగాలి, చిత్రకన్ను (కథా సంపుటి), అనిమేష (దీర్ఘకవిత).. ఇలా ఎన్నో రచనలు చేశారు. 

-నాగేటి సాల్లల్ల నా తెలంగాణ (పోరు తెలంగాణ–2011), ఒక పువ్వు ఒక నవ్వు ఉయ్యాలలూగేనా.. ఒక నువ్వు ఒక నేను ఊహల్లో తేలేమా (జై బోలో తెలంగాణ-– 2011) పుడమి పండుగ పువ్వుల జాతర.. మగువల పండుగ మమతల జాతర (కొలిమి), ఇది చరిత్ర ఇది పవిత్ర జనవిముక్తి సమరం.. సాయుధ రైతాంగ పోరు సాహసమే అమరం (బందూక్-2015), చెలియా చెలియా విడిపోకే కలలా (2 కంట్రీస్ -2017) లాంటి పాటలు రాశారు. 

1986లో భూమిస్వప్నం కవితాసంపుటికి ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం, 1988లో భూమిస్వప్నం కవితాసంపుటికి ఇందూరు భారతి వారి దాశరథి పురస్కారం, 2001లో ప్రాణహిత కవితాసంపుటికి తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారం, 2009లో ఒక బాధ కాదు కవితాసంపుటికి విశ్వకళాపీఠం వారి స్నేహనిధి ఉత్తమ కవితా పురస్కారం, 2010లో ‘నాగేటి సాలల్లో నా తెలంగాణా’ పాటకు ఉత్తమ గేయ రచయితగా నంది పురస్కారం. 2016లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి సాహిత్యంలో విశిష్ట పురస్కారం అందుకున్నారు. తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో పాటలు, కవిత్వం ద్వారా ప్రజలను నందిని సిధారెడ్డి  ఆలోచింపజేశారు.

ప్రముఖుల హర్షం
నందిని సిధారెడ్డికి జాతీయ సాహిత్య అవార్డు లభించడంపై సీఎం రేవంత్​ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి తోపాటు పలువురు సాహిత్య ప్రముఖులు, సహచరులు హర్షం వ్యక్తం చేశారు. సిధారెడ్డి తన అమూల్యమైన రచనలతో తెలుగు సాహితీ రంగానికి విశిష్ట సేవలు అందించారని కొనియాడారు.