- ఆనాడు తెలంగాణ మరమ్మతులు చేస్తామన్నా ఒప్పుకోలేదు
- సగం ఆక్రమించుకుని తామే ఆపరేట్ చేసుకుంటామని బోర్డుకు లేఖలు
- రిపేర్లు సహా నిర్వహణ బాధ్యతలు ఏపీకే అప్పగించిన బోర్డు
- తీరా ఇప్పుడేమో తెలంగాణ రిపేర్లు చేస్తలేదంటూ బోర్డుకు ఏపీ లెటర్లు
- దీనిపై తెలంగాణ వివరణ కోరిన కేఆర్ఎంబీ.. బోర్డు తీరుపైనా విమర్శలు
హైదరాబాద్, వెలుగు: నాగార్జున సాగర్‌పై ఏపీ తిరకాసులు పెడుతున్నది. ఈ ప్రాజెక్టు కుడికాల్వ హెడ్‌రెగ్యులేటర్‌ను తన చేతుల్లోకి తీసేసుకొని.. అటువైపు తెలంగాణ అధికారులు వెళ్లకుండా అడ్డుకుంటున్నది. రిపేర్లు, నిర్వహణ తామే చూసుకుంటామంటూ కృష్ణా బోర్డుకు లేఖలు కూడా రాసింది. తీరా ఇప్పుడేమో రిపేర్లు, డ్యామ్ నిర్వహణను తెలంగాణ పట్టించుకోవడం లేదంటూ మాట మారుస్తున్నది. కుడికాల్వ గేట్ల పరిస్థితి బాగాలేదని, రిపేర్లు చేయాలని తెలంగాణ పదేపదే మొత్తుకున్నా, రిపేర్లు చేయడానికి ప్రయత్నించినా.. ఆనాడు ఏపీ అనుమతించలేదు.
అటువైపు తెలంగాణ అధికారులను రానివ్వలేదు. తీరా ఇప్పుడు పరిస్థితి చేయిదాటిపోతుందనుకుంటున్న టైమ్‌లో నిందను తెలంగాణపైకి తోస్తున్నది. తెలంగాణ కావాలనే రిపేర్లు చేయట్లేదన్నట్టుగా మొండివాదనకు దిగుతున్నది. ఇప్పుడు ఇదే విషయంపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేస్తూ ఏపీ లేఖ రాసింది. ఆ రాష్ట్ర తీరుపై ఇప్పటికే పలుమార్లు కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. కానీ బోర్డు మాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడేమో ఏపీ ఫిర్యాదు చేసిందే తడవుగా తెలంగాణ నుంచి వివరణ కోరింది. దీంతో బోర్డు తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సాగర్‌ను తెలంగాణకు అప్పగించినా..
నాగార్జునసాగర్ డ్యామ్ బాధ్యతలను తెలంగాణకు, శ్రీశైలం డ్యామ్ బాధ్యతలను ఏపీకి కేంద్రం అప్పగించింది. అందులో భాగంగా సాగర్ డ్యామ్ మెయింటెనెన్స్‌ను పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇప్పటికే రూ.20 కోట్లతో పలు మరమ్మతులు చేపట్టింది. గేట్ల రబ్బర్ సీల్స్ మార్పు, గ్రీజింగ్, రోప్‌ల మార్పిడితో పాటు గ్యాంట్రీ పట్టాల మార్పిడి, గ్యాలరీ తదితర పనులను గత కొంతకాలంగా నిర్వహిస్తున్నది. అయితే అసెంబ్లీ ఎన్నికల టైంలో ఏపీ సర్కార్ అక్రమంగా సాయుధ బలగాలతో వచ్చి డ్యామ్ కుడివైపు 13వ గేట్ వరకు, కుడికాలువ రెగ్యులేటర్‌ను ఆక్రమించుకోవడం.. అటు తరువాత కేంద్రం జోక్యం చేసుకుని సీఆర్పీఎఫ్ బలగాలను అక్కడ ఏర్పాటు చేయడం తెలిసిందే. డ్యామ్‌ను పూర్తిగా కేఆర్‌ఎంబీ అధీనంలోకి తీసుకున్నది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం డ్యామ్ రిపేర్లకు అనుమతివ్వాల్సిందిగా నిరుడు బోర్డును కోరింది. బోర్డు కూడా అంగీకరించి రిపేర్లు చేయాలని చెప్పింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం రిపేర్లను చేపట్టగా.. ఏపీ మాత్రం అడ్డు తగిలింది. పనులు చేసే అధికారం ఎక్కడిదంటూ ఉల్టా ప్రశ్నించింది. ఆ పనులు అవసరమా కాదా అంటూ కేఆర్‌ఎంబీకి లేఖ రాసింది. తమవైపున్న డ్యామ్‌కు రిపేర్లు తామే చేసుకుంటామని, మెయింటెనెన్స్కూడా చూసుకుంటామని బోర్డుకు తేల్చి చెప్పింది.
దానికి అనుమతులూ ఇవ్వాలని బోర్డుకు లేఖ రాసింది. ఏపీకి చెందిన అధికారులు, సహాయక సిబ్బందిని అనుమతించాలని, ఏపీ జలవనరుల శాఖ, జెన్‌కోలకు చెందిన వాహనాలను సైట్ సందర్శన సమయంలో డ్యామ్‌పైకి అనుమతించాలని కోరింది. వర్షాకాలం ముందు, తర్వాత చేయాల్సిన తనిఖీలు, అత్యవసర పనులు, నీటి విడుదలను పర్యవేక్షణను తమకే అప్పగించాలని ఏపీ డిమాండ్ చేసింది. దీంతో త్రీమెన్ కమిటీలో నిర్ణయం తీసుకోవాలని బోర్డు నిర్ణయించినా.. కుడివైపు నిర్వహణను ఏపీకే అప్పగించింది. దీంతో అప్పట్నుంచి కుడివైపు మెయింటెనెన్స్ ఏపీ చేతుల్లోనే ఉంది.
అప్పుడట్లా.. ఇప్పుడిట్లా..
కుడికాల్వ హెడ్‌రెగ్యులేటర్, డ్యామ్13 గేట్ల మెయింటెనెన్స్, ఆపరేషన్ప్రొటోకాల్స్, మరమ్మతులను చేయకుండా తెలంగాణకు అడ్డుతగిలిన ఏపీ.. తామే మెయింటెనెన్స్ చేసుకుంటామని బోర్డు మీటింగుల్లో గగ్గోలు పెట్టింది. కానీ ఎప్పుడూ డ్యామ్మెయింటెనెన్స్ను పట్టించుకున్న పాపానపోలేదు. హెడ్ రెగ్యులేటర్ గేట్లను తనకు ఇష్టమొచ్చినప్పుడు ఆపరేట్ చేయడంతో పాటు గ్రీజింగ్ తదితర పనులను నిర్వహించకపోవడంతో చాలా టెక్నికల్ సమస్యలు తలెత్తుతున్నాయి.
గేట్లు ప్రస్తుతం ప్రమాదకర స్థితికి చేరుకున్నట్లు చెబుతున్నారు. ఇటీవల ఎన్‌డీఎస్ఏ, కేఆర్‌ఎంబీ అధికారులు డ్యామ్‌ను పరిశీలించి.. కుడికాలువ హెడ్రెగ్యులేటర్నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ప్లేట్ ఫిరాయించిన ఏపీ.. దీనికి తెలంగాణే కారణమంటూ వాదిస్తున్నది. నిర్వహణ చేపట్టకుండా ఒకవైపు తెలంగాణను అడ్డుకుంటూ, మరోవైపు తెలంగాణదే బాధ్యతని నిందలు వేయడం.. ఆ సర్కార్ తీరుకు అద్దం పడుతున్నది. ఏపీ లేఖ రాసిందే తడవుగా నిజానిజాలు తెలుసుకోకుండా, గతంలోని ఆ రాష్ట్ర వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా.. ఇప్పుడు తెలంగాణను బోర్డు వివరణ కోరడమేంటన్న వాదనలు వినిపిస్తున్నాయి.
