
- పాములు, జెర్రులు, తేళ్లతో ప్రమాదం పొంచి ఉంటుంది
- వర్షాల నేపథ్యంలో అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం
- నవంబర్ నాటికి వెయ్యి సొంత భవనాలు అందుబాటులోకి తెస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: వర్షాకాలం నేపథ్యంలో అంగన్ వాడీల్లో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. వర్షంలో నానడం వల్ల అంగన్ వాడీ భవనాల్లో పెచ్చులు ఊడే ప్రమాదం ఉందని, అటువంటి భవనాలను గుర్తించి తక్షణం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేని చోట ప్రైవేట్ భవనాల్లోకి కేంద్రాలను మార్చాలన్నారు. శిథిలావస్థలో ఉన్న అంగన్ వాడీ భవనాల స్థానంలో వెయ్యి కొత్త భవనాలను నిర్మిస్తున్నామని, దివంగత ప్రధాని ఇందిరా గాంధీ జయంతి రోజైన నవంబర్ 19న వాటిని ప్రారంభిస్తామన్నారు.
శుక్రవారం సెక్రటేరియెట్ లో అంగన్ వాడీలపై మహిళాస్ర్తీ, శిశుసంక్షేమ శాఖ సెక్రటరీ అనిత, డైరెక్టర్ సృజన, ఉన్నతాధికారులతో మంత్రి సీతక్క రివ్యూ చేశారు. మంత్రి మాట్లాడుతూ వర్షాల నేపథ్యంలో రాత్రి వేళల్లో తేళ్ళు, జెర్రులు వంటి విషపురుగులు అంగన్ వాడి కేంద్రాల్లోకి వచ్చే ప్రమాదముందని, ఉదయం సిబ్బంది రాగానే పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించేలా చూడాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంగన్ వాడీ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా అధికారులు అంగన్ వాడీ కేంద్రాలను విధిగా సందర్శించాలని, హాజరు శాతాన్ని పెంచేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంగన్ వాడీ సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరవేయడం, లబ్ధిదారులకు అన్ని హక్కులు కల్పించడమే ప్రధాన బాధ్యతగా సీడీపీఓలు పనిచేయాలన్నారు.
23 మంది సీడీపీఓలకు అపాయింట్ మెంట్ ఆర్డర్లు
మహిళాశిశు సంక్షేమ శాఖలో కొత్తగా ఎంపికైన 23 మంది చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సీడీపీఓ) లకు సెక్రటేరియెట్‌లో మంత్రి సీతక్క నియామకపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓలతో పాటు వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమ శాఖకు సీడీపీఓలు వెన్నెముక అని పేర్కొన్నారు.
కొత్తగా నియమితులైన అధికారులు ప్రజల మధ్య వెళ్లాలని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లోనవకుండా స్వేచ్ఛగా పనిచేయాలని సూచించారు. కాగా.. సైదాబాద్ జువెనైల్ హోం నుంచి ఐదుగురు బాలలు తప్పించుకుపోయిన ఘటనపై మంత్రి సీరియస్ అయ్యారు. ఇద్దరు సూపర్ వైజర్లను తొలగించి సూపరింటెండెంట్ కు మెమో జారీ చేశారు.
పచ్చదనం -స్వచ్ఛదనంపై స్పెషల్ డ్రైవ్
గ్రామాల్లో ‘పచ్చదనం -స్వచ్ఛదనం’ పెంచేలా ఆగస్టు మొదటి వారంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. సెక్రటేరియెట్‌లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై జిల్లా అడిషనల్ కలెక్టర్లు, జడ్పీసీఈవోలు, డీపీఓలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు. తాగునీరు, పారిశుధ్యం, రోడ్లపై సమీక్షించారు. గ్రామాల్లో సానిటేషన్, తాగునీటి సరఫరా, గ్రామీణ రోడ్ల పరిస్థితిపై రోజూ నివేదిక సమర్పించాలని మంత్రి ఆదేశించారు.