జీపీల నిర్వహణకు రూ.500 కోట్లు : మంత్రి సీతక్క

జీపీల నిర్వహణకు రూ.500 కోట్లు : మంత్రి సీతక్క
  • విలేజ్  డెవెలప్​మెంట్ లో సర్పంచుల పాత్ర కీలకం
  • బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలి 
  • సర్పంచుల శిక్షణ కార్యక్రమంలో మంత్రి సీతక్క

ములుగు, వెలుగు: గ్రామ పంచాయతీల నిర్వహణకు రూ.500 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. మంగళవారం ములుగులోని ఆర్అండ్ బీ గెస్ట్  హౌస్ లో ములుగు, వెంకటాపూర్, మల్లంపల్లి, గోవిందరావుపేట మండల సర్పంచుల 5 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. గెస్ట్ హౌస్  ఆవరణలో ఏర్పాటు చేసిన వర్మీ కంపోస్ట్  తయారీ, తడి, పొడి చెత్త నిర్వహణ స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ములుగు, మల్లంపల్లి మండలాలకు చెందిన 75మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జీపీల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక బృందాలతో సర్వే చేపిస్తామని, సర్పంచులకు మరిన్ని బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. బాల్యవివాహాల నిర్మూలన, గ్రామాల్లో అత్యంత పేదరికంలో ఉన్న వారిని గుర్తించడం, మహిళా సంఘాలను ప్రోత్సహించడం, అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులకు పంచాయతీ రాజ్ చట్టంపై పూర్తి అవగాహన ఉండాలని, సేవకులమనే భావనతో ప్రజలకు సేవ చేయాలని సూచించారు. మహిళలు ఆర్ధికంగా అభివృద్ధి చెందేలా చూడాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే నిధులు అందరికీ ఉపయోగపడే పనులకు ఖర్చు చేయాలన్నారు. సర్పంచులకు పంచాయతీ రాజ్ చట్టం, విధులు, బాధ్యతలపై పూర్తి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అడిషనల్​కలెక్టర్​ సంపత్ రావు, లైబ్రరీ చైర్మన్  బానోత్  రవిచంద్ర, ఏఎంసీ చైర్మన్  రేగా కల్యాణి, డీపీవో వెంకయ్య, ఆత్మ కమిటీ చైర్మన్  కొండం రవీందర్​రెడ్డి పాల్గొన్నారు.

మేడారంలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

తాడ్వాయి: మేడారంలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. మంగళవారం మేడారం సమ్మక్కసారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజును దర్శించుకున్నారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహా జాతర ముగిసి రెండు వారాలు అవుతున్నా భక్తులు తల్లుల దర్శనానికి తరలివస్తున్నారని తెలిపారు. మేడారంలో నిరంతరం పారిశుధ్య పనులు కొనసాగించాలని డీపీవోకు సూచించారు. అనంతరం స్టాల్స్ ను పరిశీలించి ఇప్ప పువ్వు లడ్డూ  ప్రసాదాన్ని రుచి చూసి బాగుందని కితాబిచ్చారు. సర్పంచ్  పీరీల భారతి వెంకన్న, ములుగు ఏఎంసీ చైర్మన్  రేగా కల్యాణి, జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, గొల్లపల్లి రాజేందర్  పాల్గొన్నారు.