యూపీఎస్సీ అభ్యర్థులకు ప్రెప్ మంకీ యాప్ వరం : మంత్రి శ్రీధర్ బాబు

యూపీఎస్సీ అభ్యర్థులకు ప్రెప్ మంకీ యాప్  వరం : మంత్రి శ్రీధర్ బాబు
  • సరైన గైడెన్స్ ఉంటే ఉన్నత స్థాయికి గ్రామీణ యువత: శ్రీధర్ బాబు

హైదరాబాద్, వెలుగు: సాంకేతికతను విద్యా రంగానికి అనుసంధానం చేయడం ద్వారా విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించవచ్చని ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు కూడా సరైన మార్గదర్శకత్వం లభిస్తే ఉన్నత స్థాయికి చేరుకోగలరని పేర్కొన్నారు. యూపీఎస్సీ సహా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఆధునిక సాంకేతికతతో నాణ్యమైన మార్గదర్శకత్వం అందించేందుకు రూపొందించిన ‘ప్రెప్‌‌ మంకీ’ అనే ఏఐ  యాప్‌‌ను సోమవారం హైదరాబాద్‌‌లో ఆయన ప్రారంభించి మాట్లాడారు. 

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రెప్ మంకీ యాప్ ఎంతో ఉపయోగకరంగా మారుతుందని, డిజిటల్ విద్యా విప్లవంలో ఇలాంటి వినూత్న ఆలోచనలు మరింత ముందుకు రావాలని ఆకాంక్షించారు. విద్యా నిపుణులు, సాంకేతిక నిపుణులు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ యాప్‌‌లో స్మార్ట్ నోట్స్, సమాధానాల మూల్యాంకనం, అనుకూల ప్రశ్నా బ్యాంకులు, తక్షణ పనితీరు విశ్లేషణ, మెంటార్ సహాయం వంటి ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. ప్రెప్‌‌ మంకీ వ్యవస్థాపక బృందంలో తలశిల రంజిత్, సుధాకర్, రామ్ అభినవ్ తేజ్, పావని, ఆకాశ్, మేఘనా రెడ్డి ఉన్నారు. కాగా, తెలంగాణాలో ఏటా చదువులు పూర్తి చేసుకుంటున్న 2 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు శిక్షణనిచ్చి, ఉద్యోగాలకు సంసిద్ధులను చేసే కర్తవ్యాన్ని పరిశ్రమలు స్వీకరించాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. యూనివర్సిటీ చదువులకు, ఇండస్ట్రీ అవసరాలకు అంతరం పెరిగినందున ప్రతి సంస్థ తమ బాధ్యతగా శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. 

త్వరలో రీస్కిల్లింగ్ కార్యక్రమాలు 

హైదరాబాద్ సిటీకి చెందిన పీఎస్ఆర్ టెక్ హబ్ సంస్థ పదేండ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం బేగంపేటలోని వివాంతా హోటల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. వేగంగా విస్తరిస్తున్న ఏఐ ప్రభావాన్ని ఎదుర్కొనేలా వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఇంజనీర్ల నైపుణ్యాలను పెంచేందుకు ప్రభుత్వం సహకరిస్తోందని తెలిపారు. ‘ఏఐ హబ్’ పేరుతో ప్రత్యేక శిక్షణ సంస్థను ఏర్పాటు చేసి వచ్చే రెండు నెలల్లో రీస్కిల్లింగ్  కార్యక్రమాలు ప్రారంభిస్తామని వెల్లడించారు.