గణేశ్ శోభాయాత్రకు భారీగా ఏర్పాట్లు

 గణేశ్ శోభాయాత్రకు భారీగా ఏర్పాట్లు

ఆదివారం హైదరాబాద్ లో  జరిగే గణేశ్ శోభా యాత్రకు భారీగా ఏర్పాట్లు చేశామని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. భాగ్యనగర శోభాయాత్రకు దేశవ్యాప్త గుర్తింపు ఉందని.. అన్ని విభాగాల సమన్వయం కోసం వాట్సాప్ గ్రూపు కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇందులో  భాగంగా  ట్యాంక్ బండ్ పై గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను GHMCమేయర్ గద్వాల విజయలక్ష్మి, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, జిల్లా కలెక్టర్, GHMCకమిషనర్ తో కలిసి పరిశీలించారు.

ఈసారి ట్యాంక్ బండ్‌పై 40 క్రేన్ల ద్వారా గణేశ్‌ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేశామని.. ఖైరతాబాద్ వినాయకుడిని  క్రేన్ నంబర్ 6  దగ్గర  నిమజ్జనం చేయనున్నట్లు చెప్పారు. హైకోర్టు ఆదేశాలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామని చెప్పారు. అంతేకాదు...హుస్సేన్ సాగర్ పై అంబులెన్సులను సిద్ధంగా  ఉంచడంతో పాటు..1,25,000 మాస్కుల పంపిణీకి ఏర్పాట్లు చేశామన్నారు. నిమజ్జనం సజావుగా సాగేందుకు 19వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు మంత్రి తలసాని.