
హైదరాబాద్, వెలుగు: ఎస్ఎల్బీసీ టన్నెల్, డిండి ప్రాజెక్టులను రెండేండ్లలో పూర్తి చేయాలని ఇంజనీర్లను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. గత ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. తాము పూర్తి సహకారం అందిస్తామని ఇంజనీర్లకు హామీ ఇచ్చారు. గురువారం సెక్రటేరియెట్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలునాయక్, జయవీర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, వేముల వీరేశంతో కలిసి ఆయన నల్గొండలోని ప్రాజెక్టులపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఇంజనీర్లు ప్రాజెక్టుల పెండింగ్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ‘‘44 కిలో మీటర్ల పొడవైన టన్నెల్ పనుల్లో ఇంకా 9 కిలో మీటర్ల సొరంగం పనులు పెండింగ్‌లో ఉన్నాయి. రెండు వైపుల నుంచి పనులు స్పీడప్ చేయాలి. రెండేండ్లలో పనులు పూర్తి చేయాలని డెడ్‌లైన్ పెట్టుకోవాలి. సాంకేతిక అడ్డంకులను అధిగమించడానికి నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలి’’అని ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జాను ఉత్తమ్ ఆదేశించారు.
భూసేకరణకు రూ.90 కోట్లు రిలీజ్ చేస్తాం
డిండి, పెండ్లిపాకాల రిజర్వాయర్ల పనులు 95 శాతం వరకు పూర్తయ్యాయని, భూసేకరణకు అవసరమైన రూ.90 కోట్లు త్వరగా విడుదలయ్యేలా చర్యలు చేపడ్తామని మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. ప్రాజెక్టుకు అటవీ, పర్యావరణ అనుమతులు సాధించే ప్రక్రియలో వేగం పెంచాలన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఖర్చు పెట్టే ప్రతిపైసా సద్వినియోగం చేయాలని, ఆయకట్టు పెంచే పనులకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సమావేశంలో ఇరిగేషన్ అధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు.