- బీఆర్ఎస్ చేసిన అప్పులను కాంగ్రెస్ సర్కార్ తీరుస్తోంది: మంత్రి వివేక్ వెంకటస్వామి
- ఇందిరమ్మ ఇండ్లతో పేదల సొంతింటి కల సాకారం
- యువతకు జర్మనీలో ఉపాధి కల్పనకు చర్యలు చేపట్టామన్న మంత్రి
- పలు అభివృద్ధి పనుల పరిశీలన, అధికారులకు సూచనలు
- రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ విజేతలకు బహుమతుల పంపిణీ
కోల్ బెల్ట్/చెన్నూర్, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం పాజెక్టు, మిషన్ భగీరథ పేర్లతో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారని కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. బుధవారం మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ లోని ఠాగూర్ స్టేడియంలో ‘అస్మిత ఖేలో ఇండియా’ గర్ల్స్ అండర్-16 స్టేట్ లెవల్ ఫుట్‌బాల్ టోర్నమెంటు ఫైనల్ మ్యాచ్ జరిగింది.
ఈ సందర్భంగా విజేతగా నిలిచిన కరీంనగర్, రన్నరప్‌గా నిలిచిన రంగారెడ్డి జట్లకు మంత్రి వివేక్ బహుమతులు అందించారు. అంతకు ముందు చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి కోటపల్లి, జైపూర్ మండలాలకు చెందిన 144 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. చెన్నూర్ మండలం బావురావు పేటలో ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆయా సందర్భాల్లో మంత్రి మాట్లాడారు. మిషన్ భగీరథ ఒక విఫల ప్రాజెక్ట్ అన్నారు. బీఆర్ఎస్ పాలకులు మిషన్ భగీరథలో రూ.60వేల కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లక్ష కోట్లు మింగారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద భూములు కోల్పోయిన దేవులవాడ, బబ్బేరు చెలక, లక్మిపూర్ రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదని, తాను ఎమ్మెల్యే అయిన తర్వాతే వారికి రు.26కోట్లు పరిహారం ఇప్పించినట్లు చెప్పారు. జర్మనీలో స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. ఇందుకోసం యువతకు జర్మన్ భాష నేర్పించడంతో పాటు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా శిక్షణ ఇస్తున్నామన్నారు.
ఇందిరమ్మ ఇండ్లకు రూ.5,500 కోట్లు
కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి పేదల సొంతింటి కల తీర్చిందని చెప్పారు. ఈ ఏడాది కూడా ఒక్కో నియోజకవర్గానికి 2,400 ఇండ్లు మంజూరు చేనున్నామని, ప్రభుత్వం ఇందుకోసం బడ్జెట్లో రు.5,500 కోట్లు కేటాయించిందన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా చెన్నూరు నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం తాను కృషి చేసినట్టు మంత్రి చెప్పారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గంలో 300 బోర్లు వేయించానని, అన్ని గ్రామాలు, పట్టణాల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీ లు నిర్మించామని, హై మాస్ట్ లైట్లను ఏర్పాటు చేశామన్నారు. వచ్చే రెండేండ్లలో చెన్నూరును ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు.
నీటి ఎద్దడి నివారణకు విశాఖ ట్రస్టు ద్వారా చెన్నూరులో 100 బోర్లను వేయించానన్నారు. చెన్నూర్ మండలం బావురావుపేటలో 100 ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. బావురావుపేట నుంచి కత్తెరసాల వరకు రు.5 కోట్లు, బావురావుపేట నుంచి కాచనపల్లి వరకు రు.3 కోట్లతో రోడ్డు విస్తరణ చేస్తున్నామని, ఈ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చెన్నూరు మండల కేంద్రంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
క్రీడలను ప్రోత్సహించాలి
క్రీడల పట్ల ఆసక్తి ఉన్న స్టూడెంట్లను గుర్తించి ప్రోత్సహిస్తే మండల, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తారని మంత్రి వివేక్ చెప్పారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణిస్తే భవిష్యత్ ఉంటుందన్నారు. ఫుట్ బాల్ అసోసియేషన్ బాధ్యుడు రఘునాథ్ రెడ్డి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోటీలను నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నాడన్నారు.
ఇందిరమ్మ గృహ ప్రవేశానికి హాజరు
చెన్నూరు మండలం బావురావు పేటలో ఎగుడ మౌనిక, శేఖర్ ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోగా బుధవారం వారి గృహ ప్రవేశానికి మంత్రి వివేక్ వెంకటస్వామి, కలెక్టర్ కుమార్ దీపక్, గ్రామ సర్పంచ్ తాటి శ్రీనివాస్ హాజరయ్యారు. చెన్నూరు మండలం పొక్కూరు బీఆర్ఎస్ సర్పంచ్ ఐత స్వరూప సత్తయ్య మంత్రి సమక్షంలో కాంగ్రెస్ లో చేశారు.
ఆయా కార్యక్రమాల్లో మందమరి ఏరియా సింగరేణి జీఎం ఎన్ రాధాకృష్ణ, డీవైసీఎంఓ మధు కుమార్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, మందమర్రి సీఐ పర్శ రమేశ్, రామకృష్ణాపూర్ ఎస్సై శ్రీధర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పిన్నింటి రఘునాథరెడ్డి, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ పల్లె రాజు తదితరులు పాల్గొన్నారు.

