- జూన్ 2 నుంచి రెండో విడత మంజూరు చేస్తం: మంత్రి వివేక్ వెంకటస్వామి
- అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడి
- ఉమ్మడి మెదక్ జిల్లాలో పర్యటన
- 83 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
సంగారెడ్డి/పటాన్ చెరు/జిన్నారం/ తొగుట(దుబ్బాక), వెలుగు: జూన్ 2 నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 2,500 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులిస్తామని చెప్పారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల, ఇంద్రేశం, ఇస్నాపూర్, జిన్నారం, పాశమైలారం, చిట్కుల్, భానూర్ ప్రాంతాల్లో మంగళవారం మంత్రి పర్యటించారు.
కొత్త మున్సిపాలిటీల్లో రూ.83 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వివిధ చోట్ల జరిగిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ దయతోనే పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందిందన్నారు. ఆమె ప్రధానిగా ఉన్న సమయంలోనే బీడీఎల్, ఓడీఎఫ్ వంటి డిఫెన్స్ పరిశ్రమలు ఏర్పాటయ్యాయని చెప్పారు. పరిశ్రమల ద్వారా వచ్చే ఆదాయాన్ని స్థానిక అభివృద్ధికి వినియోగించాలని సూచించారు.
పటాన్‌చెరు నుంచి శంకర్‌పల్లి వరకు, ఇంద్రేశం నుంచి దౌల్తాబాద్ వరకు 100 ఫీట్ల రోడ్డు విస్తరణకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. పటాన్‌చెరులో ఇందిరాగాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తామని, పటాన్‌చెరు ఏరియా ఆస్పత్రికి మాజీ సీఎం టి. అంజయ్య పేరు పెట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. గుమ్మడిదలలో భూములు కోల్పోయిన రైతులకు 100 గజాల చొప్పున స్థలాలు అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గుమ్మడిదల-కానుకుంట రోడ్డు అభివృద్ధికి రూ.7 కోట్ల 20 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. కొత్త మున్సిపాలిటీలను రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని, రోడ్లు, డ్రైనేజీలు, పారిశుధ్యం, తాగునీటి సదుపాయాలవంటి మౌలిక వసతులు కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
రూ.83 కోట్లతో అభివృద్ధి పనులు
పటాన్‌చెరు నుంచి భానూర్ వరకు రూ.8.30 కోట్లతోచేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో రూ.15 కోట్లతో వివిధ మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. తెల్లాపూర్ డివిజన్ ఉస్మాన్ నగర్, జిన్నారం లోని కస్తూర్బా గాంధీ బాలికల స్కూళ్లలో అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గడ్డపోతారంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు చేయిస్తానని, ఈఎస్ఐ డిస్పెన్సరీ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లపూర్ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. చెల్లపూర్ హైస్కూల్ కు ప్రహరీగోడ , మూడో వార్డులో బోర్ కావాలని స్థానిక నాయకులు కోరగా సానుకూలంగా స్పందించిన మంత్రి.. నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కొండె స్వామి రెడ్డి,జనార్దన్ రెడ్డి,నర్సింలు, స్వామి పాల్గొన్నారు.-
