ఎమ్మెల్యే లాస్యది రోడ్డు ప్రమాదమే.. అనుమానాలు లేవు

ఎమ్మెల్యే లాస్యది రోడ్డు ప్రమాదమే.. అనుమానాలు లేవు

ఎమ్మెల్యే లాస్య కారు ప్రమాదంపై పోలీసులు నోరు విప్పారు. ప్రమాద ఘటనపై మీడియాకు వివరాలు వెల్లడించారు. ఎమ్మెల్యే లాస్య కారు ప్రమాదం.. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని.. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు అడిషినల్ ఎస్పీ సంజీవరావు. సదాశివపేట దర్గాను సందర్శించుకోవటానికి.. 2024, ఫిబ్రవరి 23వ తేదీ తెల్లవారుజామున ఎమ్మెల్యే లాస్య ఇంటి నుంచి బయలుదేరినట్లు వివరించారాయన. ఆ తర్వాత 4 గంటల 58 నిమిషాలకు ఎమ్మెల్యే లాస్య కారు.. శామీర్ పేట టోల్ ప్లాజా క్రాస్ చేసినట్లు రికార్డ్ ఉందని.. అక్కడే ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కినట్లు వెల్లడించారాయన. అక్కడి నుంచి  సుల్తాన్ పూర్ ఎగ్జిట్ సమీపంలో.. ఉదయం 5 గంటల 38 నిమిషాలకు ముందు వెళ్తున్న వాహనాన్ని ఎమ్మెల్యే లాస్య కారు ఢీకొన్నదని.. ఆ వెంటనే పక్కనే ఉన్న రైలింగ్ ను వేగంగా ఢీకొట్టినట్లు స్పష్టం చేశారాయన. 

ప్రమాదంలో డ్రైవర్ ఆకాష్ నిర్లక్ష్యం, అతి వేగం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగిందని.. ఈ ప్రమాదంలో ఎలాంటి కుట్రలు, అనుమానాలు లేవని వెల్లడించారు అడిషినల్ ఎస్పీ సంజీవరావు. ప్రమాదం జరిగిన వెంటనే ఎమ్మెల్యేను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారని.. అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు తెలిపినట్లు వివరించారాయన. ప్రమాదంలో ఎమ్మెల్యే చనిపోగా.. కారు నడిపిన డ్రైవర్ ఆకాష్ కాలుకు తీవ్ర గాయం అయ్యింది.. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారాయన. 

ఎమ్మెల్యే లాస్య మరణం రోడ్డు ప్రమాదం వల్లనే జరిగిందని.. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవని తేల్చిపారేశారు అడిషినల్ ఎస్పీ సంజీవరావు. సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని పోస్టులను ఎవరూ నమ్మొద్దని స్పష్టం చేశారాయన.