సికింద్రాబాద్ పేరు చెరపడానికి కాంగ్రెస్ కుట్ర : ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

సికింద్రాబాద్ పేరు చెరపడానికి కాంగ్రెస్ కుట్ర : ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
  • దమ్ముంటే ముందు హైదరాబాద్ పేరు మార్చండి 
  • ఎమ్మెల్యే తలసాని  సవాల్
  • సికింద్రాబాద్ పేరుతోనే కార్పొరేషన్ ఏర్పాటుకు డిమాండ్

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ పేరును చెరిపివేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని మాజీ మంత్రి, సనత్​నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. శుక్రవారం వెస్ట్ మారేడ్​పల్లిలోని క్యాంప్ ఆఫీస్​లో సికింద్రాబాద్, ముషీరాబాద్ ఎమ్మెల్యేలు పద్మారావు గౌడ్, ముఠా గోపాల్‌‌, పలువురు ప్రజాప్రతినిధులు,  సంఘాల నాయకులతో కలిసి  మీడియా సమావేశం నిర్వహించారు.

ప్రజలను, ప్రజాప్రతినిధులను, పార్టీలను అడగకుండా 9 రోజుల్లోనే డీ-లిమిటేషన్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఫైరయ్యారు. సికింద్రాబాద్ పేరు తీసేస్తే, ఇక్కడి ప్రజలు మల్కాజిగిరి అని చెప్పుకోవాలా? అని ప్రశ్నించారు. ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే పునరాలోచించాలని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి  దమ్ముంటే  హైదరాబాద్ పేరు మార్చాలని సవాల్ విసిరారు. 

17న 10 వేల మందితో భారీ ర్యాలీ

సికింద్రాబాద్ పేరుతోనే మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని, ఈ నెల 11న ఉదయం 11 గంటలకు బాలంరాయ్​లోని లీ ప్యాలెస్​లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి క్లాక్​టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్ మీదుగా ఎంజీ రోడ్​లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు 10 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తామని, అనంతరం సికింద్రాబాద్ స్టేషన్​ను ముట్టడిస్తామని వెల్లడించారు.

ఉద్యమానికి సుమారు 35కిపైగా వ్యాపార, వాణిజ్య, కార్మిక, కుల సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయన్నారు. సికింద్రాబాద్ ప్రజల ఆత్మగౌరవం, చరిత్ర, సంస్కృతిని కాపాడేందుకు అన్ని వర్గాలు, సంఘాలు, పార్టీలు ఐక్యంగా పోరాటంలో పాల్గొనాలని తలసాని శ్రీనివాస్ యాదవ్
 పిలుపునిచ్చారు.