ఇరాన్​లో బాంబు పేలుళ్లు..103 మంది మృతి

ఇరాన్​లో బాంబు పేలుళ్లు..103 మంది మృతి
  •     ఖాసీం సులేమానీ వర్ధంతి కార్యక్రమంలో వరుస బ్లాస్ట్​లు
  •     ఇది టెర్రరిస్ట్ దాడేనని అధికారుల ప్రకటన

టెహ్రాన్ :  ఇరాన్ లోని కేర్మన్ సిటీ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఆర్మీ టాప్ కమాండర్ ఖాసీం సులేమానీ వర్ధంతి కార్యక్రమంలో జరిగిన రెండు వరుస పేలుళ్లకు 103 మంది బలైపోయారు. మరో 188 మంది గాయపడ్డారు. సాహెబ్ అల్ జమాన్ మసీదు వద్ద సులేమానీ డెడ్ బాడీని ఖననం చేసిన శ్మశానవాటికకు సమీపంలోనే బుధవారం మధ్యాహ్నం పదిహేను నిమిషాల వ్యవధిలోనే రెండు బ్లాస్ట్ లు జరిగాయి. సులేమానీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్మశానవాటిక వద్దకు వందలాది మంది తరలిరాగా.. వారిని టార్గెట్ గా చేసుకుని రిమోట్ కంట్రోల్ తో బాంబులు పేల్చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో విదేశీ శక్తుల హస్తం లేదని.. ఇది టెర్రరిస్ట్​ల పనే అని కేర్మన్ డిప్యూటీ గవర్నర్ స్పష్టం చేశారు. బాంబు పేలుళ్లు సంభవించిన తర్వాత జనం భయంతో అరుస్తూ, పరుగెత్తుతున్న దృశ్యాలు వీడియోల్లో కనిపించాయి. బ్లాస్ట్​లు జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని సెక్యూరిటీ బలగాలు చుట్టుముట్టడం వల్ల కూడా జనం అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట జరిగి కొంతమందికి గాయాలయ్యాయి. కాగా, ఇరాన్ ప్రత్యక్షంగానే పాలస్తీనాకు చెందిన హమాస్, లెబనాన్ కు చెందిన షియా మిలిటెంట్ సంస్థ హిజ్బొల్లా, యెమెన్​లోని హౌతీ రెబెల్స్ కు సాయం చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో షియా వర్గం ముస్లింలు మెజార్టీగా ఉన్న ఇరాన్​లో సున్నీ వర్గం మిలిటెంట్ సంస్థలు గతంలోనూ పలుమార్లు పేలుళ్లు జరిపాయి.

ఎవరీ సులేమానీ?

ఇరాన్ ఆర్మీ ‘ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్స్ కోర్’కు చెందిన ఖుద్స్ ఫోర్స్ కు గతంలో చీఫ్ గా పని చేశాడు జనరల్ ఖాసీం సులేమానీ. మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఇరాన్ మిలిటరీ ఆపరేషన్లు నిర్వహించడమే ఖుద్స్ ఫోర్స్ ప్రధాన లక్ష్యం. ఆ ప్రాంతంలోని అమెరికా సేనలపై దాడులు చేస్తూ, యూఎస్ మిలిటరీని పారదోలడం, ఇరాక్, సిరియాలోని ఇస్లామిక్ జిహాదిస్ట్ గ్రూప్ ను ఓడించడమే లక్ష్యంగా ఈ ఫోర్స్ పనిచేసింది. విదేశాల్లో ఖుద్స్ ఫోర్స్ ఆపరేషన్లను అన్నీ తానై సక్సెస్ చేయడంతో సులేమానీ గొప్ప యుద్ధవీరుడిలా పేరు పొందాడు. సిరియా, ఇరాక్, యెమెన్ దేశాల్లో ఇరాన్ ఎజెండా అమలయ్యేలా కీలక పాత్ర పోషించాడు. అయితే, ఇరాక్​లోని అమెరికా స్థావరాలపై ఖుద్స్ ఫోర్స్ చేసిన దాడుల్లో పలువురు అమెరికా సోల్జర్లు చనిపోయారు. దీనికి ప్రతీకారంగా అమెరికా 2020 జనవరిలో డ్రోన్​తో దాడి చేసి సులేమానీని హతమార్చింది. సులేమానీ ఖననం తర్వాత అతడికి నివాళులు అర్పించేందుకు జనం కేర్మన్​కు పోటెత్తారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగి 56 మంది చనిపోయారు. అనంతరం సులేమానీని ‘లివింగ్ మార్టైర్ (సజీవ అమరవీరుడు)’గా ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ప్రకటించారు.