లక్ష ఇండ్లు ఎక్కడ కట్టారు? ఎవరికిచ్చారు? : ఎంపీ చామల

లక్ష ఇండ్లు ఎక్కడ కట్టారు? ఎవరికిచ్చారు? : ఎంపీ చామల
  • హరీశ్​ రావు సమాధానం చెప్పాలి: ఎంపీ చామల

హైదరాబాద్, వెలుగు: ‘బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ​లక్ష ఇండ్లు ఎక్కడ కట్టారు? ఎవరికిచ్చారు? హరీశ్ రావు చెప్పాలి’ అని ఎంపీ చామల కిరణ్​రెడ్డి సవాల్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్​ నాయకులు అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఇష్టానుసారంగా నాలాలు, చెరువులను కబ్జా చేశారని మండిపడ్డారు. చిన్నవాన పడితే హైదరాబాద్​లో తిరగలేని పరిస్థితి నెలకొందని.. దాని కారణం ఎవరని ప్రశ్నించారు. ఎన్నికలొచ్చాయని హరీశ్​ రావు పనికిరాని మాటలు మాట్లాడుతున్నారన్నారు. 

ఉప ఎన్నిక అంటే హరీశ్​ను ట్రబుల్ షూటర్ అని డబ్బా కొట్టేవాళ్లు.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎంత డబ్బుపెట్టారో ప్రజలందరికీ తెలుసునన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ అదే చేద్దామనుకున్నారని.. కానీ, ఇక్కడ వారి నాటకాలు నడవవని హెచ్చరించారు. నవీన్ యాదవ్ పేరు రాగానే బీఆర్ఎస్ ఇంకా గెలవదని తెలిసిపోయిందని విమర్శించారు. 

ఎవరు గూండాలు? ఎవరు డబ్బులతో గెలవాలని చూస్తున్నారో 11వ తేదీ ప్రజల నిర్ణయిస్తారన్నారు. ‘‘జూబ్లీహిల్స్ ఎన్నికలో సెంటిమెంట్ మీద ఓట్లు సంపాదించుకోవాలని చూస్తున్నారు. ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నరు. ప్రజలు అమాయకులు కాదు. బీఆర్ఎస్​ పార్టీ భూస్థాపితం కావడం ఖాయం. హరీశ్, ఆయన బామ్మర్దికి ఎన్నికల ఫలితాలే చెంప చెల్లుమనేలా చేస్తాయి”అని చామల అన్నారు.