రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం

రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం
  • ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ  

న్యూఢిల్లీ, వెలుగు:  తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ కె. లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేస్తున్నారని అన్నారు. ఢిల్లీలోని నార్త్ బ్లాక్​లో సోమవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఓబీసీ మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాజు పూసతో కలిసి లక్ష్మణ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అరగంటకు పైగా సాగిన సమావేశంలో తెలంగాణలోని రాజకీయ పరిస్థితులపై అమిత్ షా ఆరా తీశారు. హైదరాబాద్ లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సంబంధించిన పనులు, ప్రధాని మోడీ బహిరంగ సభ ఏర్పాట్లను  అడిగి తెలుసుకున్నారు. సమావేశం అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ విస్తరణ, దేశవ్యాప్తంగా ఓబీసీ మోర్చా చేపడుతున్న కార్యక్రమాలపై అమిత్ షాతో చర్చించినట్లు చెప్పారు. దక్షిణాదిలో కర్ణాటక, పుదుచ్చేరి తర్వాత తెలంగాణలో అధికారంలోకి రావడంపై హైకమాండ్ కు బలమైన నమ్మకం ఉందన్నారు. అందుకే పార్టీ పెద్దలు రాష్ట్రంపై స్పెషల్ ఫోకస్ పెట్టారన్నారు. టీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, తాము ఆ పార్టీ కుటుంబ పాలనకు స్వస్తి పలుకుతామన్నారు. పార్టీలో చేరికలు ఆగిపోలేదని, ఊర్లల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధుల చేరికలు కొనసాగుతున్నాయని తెలిపారు.