రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగి దిగుబడి పెరిగింది

రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగి దిగుబడి పెరిగింది

తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు చెరువుల్లో పూడిక తీయలేదన్నారు టీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్. కరెంటు ఉన్నా.. నీళ్లు లేక, నీళ్లుంటే కరెంటు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి ఉండేదన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోని లేనివిధంగా రైతులకు సీఎం కేసీఆర్ 24 గంటల పాటు కరెంటు ఉచితంగా ఇస్తున్నారన్నారు. ఢిల్లీలో  మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఏ రాష్ట్రంలో లేనివిధంగా రైతు బంధు పేరుతో పెట్టుబడి అందిస్తున్నారని తెలిపారు. గోదావరి, కృష్ణా నదుల మధ్యలో సారవంతమైన నేల కల్గిన రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. వృధాగా సముద్రంలో కలిసే నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఉపయోగిస్తున్నారని అన్నారు. ఫలితంగా తెలంగాణ అంతటా భూగర్భ జలాలు పెరిగాయన్నారు. ఇంటి నిర్మాణం కోసం పునాదులు తీస్తుంటేనే నీళ్లు వస్తున్నాయన్నారు. అందుకే గతంలో ఎప్పుడూ లేనంతగా సాగు విస్తీర్ణం పెరిగి దిగుబడి పెరిగిందన్నారు. యాసంగి (రబీ) పంట దిగుబడి తీసుకుంటుందా లేదా అన్నది కేంద్రం స్పష్టంగా చెప్పడం లేదన్నారు. రైతులను మోసగించేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. అందరికీ తిండిపెట్టే రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్రం, రాష్ట్రంపై ఉందన్నారు. కేంద్రం అధికారంలోకి వచ్చిన ఏడేళ్లలో గోడౌన్లు ఎందుకు కట్టలేకపోయారని ప్రశ్నించారు. బీజేపీ నేతలు మతాలు, కులాలతో చిచ్చుపెట్టుకుంటూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ బీజేపీ నాయకులు మాట్లాడేవన్నీ అవాస్తవాలేనని అన్నారు దయాకర్.