జస్టిస్పై దాడిని సుమోటోగా తీసుకోవాలి : మందకృష్ణమాదిగ

జస్టిస్పై దాడిని సుమోటోగా తీసుకోవాలి : మందకృష్ణమాదిగ

శంషాబాద్, వెలుగు: ఎన్నో కేసులను సుమోటోగా స్వీకరిస్తున్న పోలీసు వ్యవస్థకు జస్టిస్ గవాయి పైన జరిగిన దాడి కనిపించడం లేదా అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ ప్రశ్నించారు. సోమవారం శంషాబాద్ లోని టౌన్ స్పేర్స్ స్టే హోటల్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చీఫ్ జస్టీస్ స్థానంలో ఉన్న దళితుడికే రక్షణ లేకపోతే, దేశంలో సామాన్య దళితుల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. 

దాడి జరిగి 20 రోజుల గడుస్తున్నా ఇప్పటికీ కేసు నమోదు చేయకపోవడం దారుణమన్నారు. దళితుడు కాబట్టే వ్యవస్థలు స్పందించడం లేదన్నారు. విశ్వాసాలు, ధర్మాల పేరుతో దాడులకు దిగితే చట్టాలు వర్తించవా అని ప్రశ్నించారు. దాడిని నిరసిస్తూ నవంబర్ 1న లక్షలాది మందితో చలో హైదరాబాద్ పేరుతో దళితుల ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో రాగళ్ల ఉపేందర్ మాదిగ, రావుగల్ల బాబు మాదిగ, పెంటనోళ్ల నరసింహ మాదిగ, కొత్తూరు రమేశ్​మాదిగ తదితరులు పాల్గొన్నారు.