ఏ వార్డు ఎవరికో ?.. రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఉత్కంఠ

ఏ వార్డు ఎవరికో ?.. రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఉత్కంఠ
  • బల్దియాల్లో వేడెక్కిన రాజకీయాలు
  • బలమైన అభ్యర్థుల వేటలో పార్టీలు 

మెదక్, వెలుగు: మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు మొదలైంది. వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల అయ్యింది. అభ్యంతరాలను స్వీకరించి ఫైనల్​ ఓటర్​ లిస్ట్​ రిలీజ్ చేయగానే.. వార్డుల రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశం ఉంది. దీంతో కౌన్సిలర్ స్థానాలకు పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు ఏ వార్డ్ ఎవరికి రిజర్వ్ అవుతుందోనని టెన్షన్​ పడుతున్నారు. మెదక్​ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలున్నాయి. మెదక్ మున్సిపాలిటీలో32 వార్డులు, తూప్రాన్​లో​ 16 వార్డులు, నర్సాపూర్​లో 15 వార్డులు, రామాయంపేటలో 12 వార్డులు ఉన్నాయి. 

వార్డుల వారీగా అధికారులు విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలను ఆశావహులు పరిశీలిస్తున్నారు. ఏ వార్డులో ఏ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువ ఉన్నారు.. ఆ వార్డు గతంలో ఎవరికి రిజర్వ్​ అయ్యింది.. ఈసారి రిజర్వేషన్​ ఎలా వచ్చే అవకాశం ఉంది.. ఏ వార్డులు మహిళలకు రిజర్వు కానున్నాయని ప్రధాన పార్టీల నేతలు చర్చించుకుంటున్నారు. సొంత వార్డులో రిజర్వేషన్​ అనుకూలంగా రాకుంటే మరో వార్డులో పోటీ చేస్తే ఎలా ఉంటుందని తర్జన భర్జన పడుతున్నారు. 

మహిళా రిజర్వు వస్తే భార్యలనో కుటుంబసభ్యులనో పోటీ చేయించేందుకు సిద్ధమవుతున్నారు. నాలుగు మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్, బీఆర్​ఎస్, బీజేపీ నుంచి కౌన్సిలర్లుగా పోటీ చేయాలనుకుంటున్న నేతల్లో రిజర్వేషన్ల అంశం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. మున్సిపల్​ చైర్మన్​ పదవులు ఆశిస్తున్న ఆయా పార్టీల లీడర్లు అనుకూలమైన వార్డులను ఎంపిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. తమ సొంత వార్డు రిజర్వేషన్​ అనుకూలంగా రాకుంటే గెలుపు అవకాశాలు ఉండే మరో వార్డు నుంచి పోటీకి సిద్దమవుతున్నారు. మొత్తం నాలుగు మున్సిపాలిటీల్లో రాజకీయాలు వేడెక్కాయి. 

కాంగ్రెస్​ పార్టీ మున్సిపల్​ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. కౌన్సిలర్​స్థానాలకు అర్హులైన వారి పేర్లతో లిస్ట్​ తయారు చేయాలని డీసీసీప్రెసిడెంట్లకు పీసీసీ చీఫ్​ సూచించారు. ఏ వార్డు ఎవరికి రిజర్వ్​ అయినా బలమైన అభ్యర్థి బరిలో ఉండాలని, ఈ మేరకు ప్రతి వార్డులో బలమైన ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులను గుర్తించాలని ఆదేశించారు.