మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కాలంటే మెజారిటీ కౌన్సిలర్ స్థానాల్లో గెలవాలి. ఇందుకోసం ప్రధాన రాజకీయ పార్టీ లైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వ్యూహ రచన చేస్తున్నాయి. ఆయా వార్డు స్థానాల్లో ఆశావహులు ఎవరెవరు ఉన్నారు.. వారికున్న ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి, ప్రత్యర్థి పార్టీ ఎవరిని బరిలో నిలిపే చాన్స్ ఉంది, అన్ని రకాలుగా ఎదుర్కొనే సత్తా ఎవరికుంది? అనే దానిపై సర్వేలు నిర్వహిస్తున్నారు.
ఆయా వార్డు పరిధిలోని వివిధ వర్గాల ప్రజల అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. బలమైన అభ్యర్థి లేని చోట ఇతర పార్టీ నుంచి వార్డులో పట్టున్న లీడర్ ను పార్టీలో చేర్చుకునే దిశగా చర్చలు జరుపుతున్నారు. దీంతో ఏ వార్డ్ స్థానంలో, ఏ పార్టీ నుంచి ఎవరు అభ్యర్థిగా బరిలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది.
మెదక్ జిల్లాలో..
మెదక్ నియోజకవర్గంలోని మెదక్, రామాయంపేట మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపిక కోసం ఎమ్మెల్యే రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు ఆధ్వర్యంలో కసరత్తు జరుగుతోంది. గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థి ఎవరూ అనే దానిపై ఇప్పటికే రెండు సార్లు సర్వే చేశారు. నర్సాపూర్ మున్సిపాలిటీ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపిక కోసం ఆ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో, తూప్రాన్ మున్సిపాలిటీలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో సర్వే కొనసాగుతోంది.
బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపిక కోసం మాజీ మంత్రి హరీశ్ రావు సూచనలకు అనుగుణంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కసరత్తు జరుగుతోంది.
నర్సాపూర్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే సునీతారెడ్డి, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జిగా నియమితులైన ఎమ్మెల్సీ వెంకట్రామ్రెడ్డి దృష్టిపెట్టారు. తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో హరీశ్ రావు పర్యవేక్షణలో ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎన్నికల ఇన్చార్జిగా నియమితులైన మచ్చ వేణుగోపాల్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపిక ఎంపీ రఘునందన్ రావు పర్యవేక్షణలో ట్రీమెన్ కమిటీ, ఎన్నికల ఇన్చార్జిగా నియమితులైన రాష్ట నాయకుల ఆధ్వర్యంలో కొనసాగుతోంది.
సిద్దిపేట జిల్లాలో..
సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్, గజ్వేల్, చేర్యాల, దుబ్బాక మున్సిపాలిటీల్లో మొత్తం 72 వార్డులకు అభ్యర్థుల ఎంపిక రాజకీయ పార్టీలకు తలనొప్పిగా మారింది. ఒక్కొ పార్టీ నుంచి వార్డుకు ముగ్గురు నుంచి ఐదుగురు పోటీ పడుతుండడంతో ఎవరికి టికెట్లు కేటాయించాలి, ఇచ్చిన వారు గెలుస్తారా అనే సందిగ్థంలో నేతలున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఆయా మున్సిపాలిటీల్లో సన్నాహాక సమావేశాలు నిర్వహించి దిశా నిర్దేశం చేయడమే కాకుండా గెలుపే లక్ష్యంగా ఎలా పనిచేయాలనే విషయాన్ని పార్టీ కేడర్ కు వివరించారు. బీఆర్ఎస్ మున్సిపాలిటీల వారీగా ఇన్చార్జిలను నియమించగా మరోవైపు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జిలు టికెట్ల కేటాయింపుపై కసరత్తు మొదలెట్టారు.
బీజేపీ అభ్యర్థుల కోసం ఎంపీ రఘునందన్ రావు ఆధ్వర్యంలో అభ్యర్థుల వేట జరుగుతోంది. హుస్నాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్అభ్యర్థుల కోసం మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్అభ్యర్థుల కోసం మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్, బీజేపీ అభ్యర్థుల కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టిపెట్టారు. చేర్యాల మున్సిపాలిటీలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థులను, కాంగ్రెస్ అభ్యర్థులను మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి ఎంపిక చేయనున్నారు.
సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలు వేట మొదలెట్టాయి. ఎలాగైనా మున్సిపాలిటీలపై జెండా ఎగురవేయాలని ఆయా పార్టీలు బలమైన క్యాండిడేట్లను బరిలో దింపేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే మున్సిపాలిటీల వారీగా సన్నాహక సమావేశాలు పూర్తిచేసి అక్కడక్కడ అభ్యర్థులను ఎంపిక చేసుకోగా, మరికొన్ని వార్డుల్లో క్యాండిడేట్ల ఎంపిక కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కొన్ని వార్డుల్లో బలమైన అభ్యర్థుల మధ్య పోటీ పెరగడంతో పార్టీలు సర్వే చేయిస్తున్నాయి.
కానీ టికెట్ తనకంటే తనకే అని అభ్యర్థులు ఎవరికి వారు ప్రచారాలు చేసుకుంటున్నారు. ఖర్చులకు వెనుకాడే ప్రసక్తి లేదని ఇటు పార్టీ వర్గాల్లో అటు ప్రజలను నమ్మ బలుకుతున్నారు. మరోవైపు సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్ చెరు, నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గ పరిధిలో ఆశావాహుల నుంచి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు అప్లికేషన్లు తీసుకొని టికెట్లు ఖరారు చేసే బాధ్యత చేపట్టారు.
