కందికి దక్కని ‘మద్దతు’.. నిబంధనల పేరుతో కొర్రీలు

కందికి దక్కని ‘మద్దతు’.. నిబంధనల పేరుతో కొర్రీలు
  • మద్దతు ధర రూ.8వేలు, ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొనేది రూ.6,800 నుంచి రూ.7వేలే
  •  నిబంధనల పేరుతో కొర్రీలు 
  •  కొనుగోలు కేంద్రాల్లో తప్పని ఎదురుచూపులు
  •  సిద్దిపేట జిల్లాలో 6 వేల ఎకరాల్లో సాగు

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లాలో మద్దతు ధర రాక కంది రైతు విలవిలలాడుతున్నాడు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో నిబంధనల పేరిట కొర్రీలు పెడుతుండడంతో రైతులు తమ దిగుబడులను అమ్ముకునేందుకు రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి. దీంతో కొందరు రైతులు తక్కువ ధరకే ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దళారులకు అమ్ముకుంటున్నారు. వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సిద్దిపేట జిల్లాలో సుమారు 6వేల ఎకరాల్లో కంది   సాగు చేయగా దాదాపు 30 వేల క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుందని అంచనా వేశారు. 

నిబంధనల పేరిట కొర్రీలు 

కంది పంటను కొనేందుకు జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చేర్యాల మార్కెట్ యార్డుల్లో ప్రభుత్వం కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసింది. క్వింటాలుకు మద్దతు ధర రూ.8వేలుగా ప్రకటించారు. కొనుగోళ్లు నత్తనడకన సాగడంతో రైతులు ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా దళారులకు అమ్ముకుంటున్నారు. ఈ ఏడాది నుంచి ఎస్ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ    సర్టిఫైడ్ చేస్తేనే కందులు కొనాలనే నిబంధన ఉండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

యార్డుకు తెచ్చిన కందుల్లో తేమ శాతం, పొల్లు అధికంగా ఉందని, నాణ్యత లేదని  చెబుతుండటంతో రైతులు కందులను ఎండకు ఆరబోస్తూ, జల్లి చేస్తూ  రోజుల తరబడి యార్డుల్లోనే పడిగాపులు పడుతున్నారు. మొక్కజొన్న పంటకు అంతర పంటగా ఎక్కువగా రైతులు కందిని సాగుచేస్తుంటారు. మొక్కజొన్న సాగు వివరాలను వ్యవసాయ శాఖకు అందించిన రైతులు.. కంది సాగు వివరాలను చెప్పకపోవడం వల్ల తమకు పక్కా లెక్కలు రావడం లేదని, అందుకే ఇబ్బందులు ఎదురువుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

మరోవైపు ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ   నిబంధన ప్రకారం ఒక్కో రైతు నుంచి  ఆరు క్వింటాళ్ల కంటే ఎక్కువ కొనవద్దనే రూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండడంతో పలువురు రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. కాగా ప్రభుత్వ కొనుగోలు సెంటర్ల ద్వారా కేవలం 2వేల క్వింటాళ్లే కొనడం గమనార్హం. 

ఎక్కువ శాతం ప్రైవేటుకే 

సిద్దిపేట జిల్లాలో పండిన కందుల్లో 80 శాతానికి పైగా ప్రైవేటు వ్యాపారులే కొంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.8వేల మద్దతు ధర లభిస్తుందని కొనుగోలు కేంద్రాలకు వెళ్తే రోజుల తరబడి ఎదురుచూడాల్సి రావడంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. జిల్లాలో అర ఎకరం నుంచి రెండెకరాల్లోపే కంది సాగు చేసిన రైతులు ఎక్కువగా ఉండడంతో వచ్చిన పంటను అమ్ముకోవడానికి ప్రైవేటు వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రైవేటు వ్యాపారులు పలు కొర్రీలు పెడుతూ క్వింటాకు రూ.6800 నుంచి రూ.7,100 చెల్లిస్తున్నారు. దీంతో రైతు క్వింటాకు రూ.వెయ్యికి పైగా నష్టపోతున్నాడు. 

తేమ శాతం ఎక్కువుందని కొనలే

నాకున్న 2. 20  ఎకరాల్లో కందులను సాగు చేసిన. మద్దతు ధర వస్తదని నాలుగు రోజుల కింద సిద్దిపేట మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తీసుకొచ్చిన. కందుల్లో తేమ శాతం, పొల్లు ఎక్కువ ఉందని చెప్పడంతో రోజూ జల్లి పట్టి ఎండకు ఆరబెడుతున్న. కందులను కొనుగోలు చేయకపోవడంతో ఎప్పుడు కొంటారోనని ఇక్కడే ఉంటున్న..-భైరి యాదగిరి, రైతు దుద్దెడ

మార్కెట్లో కొనకపోతే ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అమ్ముకున్న

2 క్వింటాళ్ల కందులు అమ్మేందుకు హుస్నాబాద్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఐదు రోజుల కింద తీసుకొచ్చిన. తేమ శాతం, పొల్లు అధికంగా ఉందని చెప్పి కొనలేదు. రోజు ఇంటి నుంచి వచ్చి సాయంత్రం వరకు చూసి పోయిన.. సోమవారం మార్కెట్ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సమస్యను విన్నవించిన.. అయినా కొనకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకున్న.. -మంద చంద్రకళ. హుస్నాబాద్ మండలం  కూచనపల్లి