హుస్నాబాద్, వెలుగు: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారు, పని చేయలేని వారు వెళ్లిపోవచ్చని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సోమవారం హుస్నాబాద్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వేసవి తీవ్రత పెరుగుతున్నందున గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జూన్ 12 వరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేసి లబ్ధిదారులతో త్వరగా గృహప్రవేశాలు చేయించాలన్నారు.
హుస్నాబాద్‌లో నిర్మిస్తున్న 250 పడకల దవాఖానను వచ్చే ఏడాదిలోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల సహకారంతో ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు. రైతులు వరికి బదులుగా ఆయిల్ పామ్ వంటి లాభదాయక పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలని సూచించారు. హుస్నాబాద్ స్పోర్ట్స్ గ్రౌండ్‌లో త్వరలో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు. అనంతరం పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఓ కార్యక్రమంలో మహిళా ప్రజాప్రతినిధులకు బదులు వారి భర్తలు మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్టూడెంట్స్‌తో కలిసి భోజనం..
హుస్నాబాద్‌లోని సోషల్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్‌ను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టూడెంట్స్‌తో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందిస్తున్నారా అని పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యం ముఖ్యమని, నాణ్యతలో రాజీ పడొద్దని ప్రిన్సిపాల్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కె.హైమావతి, డీఆర్‌డీఏ జయదేవ్ ఆర్య, డీఎంహెచ్ఓ ధనరాజ్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, ఏఎంసీ చైర్మన్ తిరుపతిరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మీ, వైస్ చైర్‌పర్సన్ పద్మ తదితరులు పాల్గొన్నారు.
