టెస్లా అండ్ స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ తన భార్య శివోన్ జిలిస్ సగం భారతీయురాలని అన్నారు. జెరోధా సహ-వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించే డబ్ల్యూటీఎఫ్ ఈజ్? అనే పాడ్‌కాస్ట్‌లో ఎలోన్ మస్క్ ఈ విషయాన్ని వెల్లడించారు.
శివోన్ జిలిస్‌కు తనకు పుట్టిన కొడుకులలో ఒకరికి శేఖర్ అనే పేరు పెట్టామని, ఇది భారతీయ-అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ గుర్తుగా పేరు పెట్టినట్లు ఎలోన్ మస్క్ తెలిపారు.
అసలు శివోన్ జిలిస్ ఎక్కడ పెరిగారని అడగ్గా ఆమె కెనడాలో పెరిగింది. చిన్నప్పుడు ఆమెను దత్తతకి ఇచ్చారు. ఆమె తండ్రి యూనివర్సిటీలో పనిచేస్తుండొచ్చని అలాగే ఆమెను దత్తత ఇచ్చారనే విషయం నాకు ఇప్పటికి ఖచ్చితంగా తెలిదు, కానీ ఆమె మాత్రం కెనడాలోనే పెరిగింది అని తెలిపారు.
శివోన్ జిలిస్ ఎవరు: శివోన్ జిలిస్ 2017లో ఎలోన్ మస్క్ స్థాపించిన ఏఐ (AI) కంపెనీ న్యూరాలింక్లో చేరారు. ప్రస్తుతం ఆమె ఆపరేషన్స్ అండ్ స్పెషల్ ప్రాజెక్టుల డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.ఆమె యేల్ విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్ & ఫిలాసఫీలో డిగ్రీ పూర్తి చేశారు.
శివోన్ జిలిస్, ఎలోన్ మస్క్‌కు నలుగురు పిల్లలు ఉన్నారు. స్ట్రైడర్ & అజూర్ కవలలు కాగా కూతురు ఆర్కాడియా, కొడుకు సెల్డాన్ లైకుర్గస్.
ఈ పాడ్‌కాస్ట్‌లో ఎలోన్ మస్క్ అమెరికా గురించి మాట్లాడుతూ టాలెంట్ ఉన్న భారతీయుల వల్ల అమెరికా ఎంతో ప్రయోజనం పొందింది. అయితే, ఇప్పుడు పరిస్థితులు మారుతున్నట్లు కనిపిస్తోంది అని అన్నారు.
అమెరికా వీసా నిబంధనలు కఠినం అవుతున్న నేపథ్యంలో వేల మంది భారతీయుల అమెరికా కలలు నెరవేరడం లేదనే వార్తల మధ్య ఎలోన్ మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
