అందెశ్రీ మృతిపై నైటా సంతాపం : నైటా ప్రెసిడెంట్‌‌ వాణి ఏనుగు

అందెశ్రీ మృతిపై నైటా సంతాపం : నైటా ప్రెసిడెంట్‌‌ వాణి ఏనుగు
  • అందెశ్రీతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న నైటా ప్రెసిడెంట్‌‌ వాణి ఏనుగు

హైదరాబాద్​, వెలుగు: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అకాల మరణంపై ప్రవాస తెలంగాణ వాసులు సంతాపం వ్యక్తం చేశారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) అధ్యక్షురాలిగా ఉన్న వాణి ఏనుగు, వారి కార్యవర్గ సభ్యులు, వ్యవస్థాపక సభ్యులు అందెశ్రీ మరణం పట్ల సంతాపం తెలిపారు. వారితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కాగా, తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఆయనకు అనేక మంది ఎన్ఆర్ఐలతో పరిచయాలు పెరిగాయి. ఉద్యమ స్ఫూర్తి, భావజాల వ్యాప్తిలో భాగంగా అనేక దేశాల ప్రవాసులు ఆయనను స్వయంగా ఆయా దేశాలకు ఆహ్వానించి, అతిథ్యం ఇచ్చారు. 2009 నుంచి అందెశ్రీ అనేకసార్లు అమెరికా వెళ్లారు.

ఇంగ్లీషు భాషతో పరిచయం లేకపోయినా ఆయన అనేక దేశాలు చుట్టొచ్చారు. భావం ఉంటే చాలు భాషతో పనిలేదని అనేవారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆట పాటలపై ప్రత్యేక ప్రేమను ప్రదర్శించిన న్యూయార్క్ ప్రవాసులు ఏనుగు లక్ష్మణ్, వాణి అనేకసార్లు అమెరికాలో అందెశ్రీకి అతిథ్యం ఇచ్చారు. అలాగే, ఆయన దక్షిణ అమెరికా దేశాల యాత్రకు స్పాన్సర్ చేయడంతో పాటు లక్ష్మణ్ ఆయన వెంట ప్రయాణించారు. ప్రస్తుతం హైదరాబాద్‌‌లో నిర్మాణంలో ఉన్న అందెశ్రీ ఇల్లు పూర్తయ్యాక త్వరలో మరోసారి ఆయనను అమెరికాకు అహ్వానిద్దామని అనుకున్నామని, ఇంతలోనే ఆయన మరణం తమకు తీవ్ర బాధను కలిగించిందన్నారు.