NEET -UG 2026 పరీక్షలో పేపర్ లీక్ అయిందన్న వార్తలపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ఇది పరీక్షలా కాకుండా 'వేలం పాట'లా మారిందని విమర్శించారు. పరీక్షకు 42 గంటల ముందే వాట్సాప్‌లో ప్రశ్నపత్రాలు అమ్ముడవుతున్నాయని ఆయన ఆరోపించారు.
దేశ యువత కలలకు మోదీ ప్రభుత్వం కంటే పెద్ద ముప్పు మరొకటి లేదని ఆయన అన్నారు. 22 లక్షల మంది విద్యార్థులు రాత్రింబవళ్లు కష్టపడి చదివితే, ఒక్క రాత్రిలోనే వారి భవిష్యత్తును బజారులో అమ్మకానికి పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లలో 89 సార్లు పేపర్లు లీక్ అయ్యాయని, 48 సార్లు మళ్లీ పరీక్షలు నిర్వహించారని గుర్తు చేశారు.
"నేను భారత యువతకు అండగా ఉంటాను.. ఈ చెడిపోయిన వ్యవస్థను మనమందరం కలిసి మారుద్దాం" అని ఆయన పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. బీజేపీ హయాంలో పరీక్షల నిర్వహణ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని మండిపడ్డారు. రాజస్థాన్‌లోని సికార్‌లో పరీక్షకు ముందే చేతితో రాసిన 'గెస్ పేపర్' బయటకు వచ్చిందని, అందులోని 135 ప్రశ్నలు అసలు పరీక్షలో వచ్చాయని ఆయన తెలిపారు.
ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వదు సరే.. కనీసం పరీక్షలను కూడా సక్రమంగా నిర్వహించలేకపోతోందని, పేపర్ లీక్ మాఫియాను కాపాడుతోందని ఆరోపించారు.
►ALSO READ | NEET: 90 బయాలజీ, 30 కెమిస్ట్రీ.. నీట్ పేపర్ లీకేజ్లో మొత్తం మ్యాచ్ అయిన ప్రశ్నలు..
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఈ అంశంపై స్పందించారు. పిల్లలు, తల్లిదండ్రులు తమ సర్వస్వం త్యాగం చేసి పరీక్షలకు సిద్ధమైతే.. ప్రతి పరీక్షా అవినీతికి బలైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం చట్టాలు చేస్తే సరిపోదని, క్షేత్రస్థాయిలో అవినీతిని అరికట్టలేనప్పుడు ఆ చట్టాల వల్ల ప్రయోజనం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఈ పరీక్షల అవకతవకలపై ప్రధాని మోదీ యువతకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న నీట్ పరీక్షలో పారదర్శకత లోపించిందని, పేద విద్యార్థుల భవిష్యత్తును వేలం వేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ముక్తకంఠంతో విమర్శించారు.
ఈ విషయంపై ఇంకా విచారణ జరుగుతోందని, ఇప్పుడే ఏమీ చెప్పలేమని ఎన్‌టిఎ (NTA) స్పష్టం చేసింది. దర్యాప్తు పూర్తి కాకముందే ఒక నిర్ణయానికి రావడం సరికాదని పేర్కొంది.
