హైదరాబాద్, వెలుగు: మెడికల్ కాలేజీల్లో టీచింగ్ ఫ్యాకల్టీ నియామకాలకు సంబంధించి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కొత్త నిబంధనలు ‘మెడికల్ ఇన్ స్టిట్యూషన్స్ (క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఫ్యాకల్టీ) రెగ్యులేషన్స్– 2025’ విడుదల చేసింది. ఫ్యాకల్టీ అర్హతలపై తలెత్తిన సందేహాలను నివృత్తి చేస్తూ.. తరచుగా అడిగే ప్రశ్నలు, వాటి సమాధానాలను పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ (పీజీఎంఈబీ) వెల్లడించింది. ఎన్ఎంసీ గుర్తించిన మెడికల్ కాలేజీలు, ఎయిమ్స్, ఎన్బీఈఎంఎస్ ఆమోదించిన సెంటర్లు, ఎన్ఎంసీ ఆమోదించిన దేశ, విదేశీ సంస్థల్లో కనీసం మూడేండ్లు కంటిన్యూగా వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉంటే ప్రొఫెసర్ల నియామకాలకు పరిగణలోకి తీసుకుంటారని పీజీఎంఈబీ తెలిపింది.
సీనియర్ కన్సల్టెంట్ గా ఎన్బీఈఎమ్ఎస్ అర్హత ఉన్నవారు, ఆ తర్వాత మూడేండ్ల టీచింగ్ అనుభవం ఉంటే ప్రొఫెసర్ గా మారవచ్చని చెప్పింది. పీజీ తర్వాత 220 బెడ్స్ గవర్నమెంట్ హాస్పిటల్ లో పదేండ్ల అనుభవం ఉన్న డాక్టర్లు అసోసియేట్ ప్రొఫెసర్ గా, రెండేండ్ల అనుభవం ఉన్నవారు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హులని పేర్కొంది. దీనికి సీనియర్ రెసిడెంట్ అనుభవం అక్కర్లేదని వెల్లడించింది.
