రైతుబంధు పేరు చెప్పి.. పరిహారం బంద్​

రైతుబంధు పేరు చెప్పి.. పరిహారం బంద్​
  • మూడేండ్లుగా ఇన్‌ఫుట్ సబ్సిడీ ఊసెత్తని రాష్ట్ర సర్కారు
  • రెండేండ్లలో రూ.10 వేల కోట్లకు పైగా పంట నష్టం
  • రైతు బంధు ఇచ్చినమని సర్కారు దబాయింపు
  • కేంద్రం ఇస్తున్న విపత్తు నిధులకూ మోకాలడ్డు

హైదరాబాద్, వెలుగు: రైతు బంధు సర్వరోగ నివారిణి అన్నట్లుగా సర్కారు భావిస్తోంది. మూడేండ్లుగా పంట నష్ట పరిహారం ఊసెత్తడం లేదు. ఎకరానికి రూ.10 వేల చొప్పున రైతు బంధు సాయం ఇస్తున్నందున.. అకాల వర్షాలు, ప్రకృతి విపత్తులతో వాటిల్లే నష్టానికి పరిహారం ఎందుకు చెల్లించాలన్నట్లుగా  వ్యవహరిస్తోంది. పంటంతా నీటి పాలైనా.. పెట్టుబడి మట్టి పాలైనా సరే.. ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదని మొండికేస్తోంది. విపత్తుల నిర్వహణ చట్టం కింద కేంద్రం ఇచ్చే పంట నష్ట పరిహారం కూడా ఇవ్వకుండా ‘రైతు బంధు జమా ఖర్చుల ఖాతా’లో లెక్కలేసుకుంది. నిరుడు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు నాలుగు నెలల్లోగా పంట నష్ట పరిహారం చెల్లించాలని మొన్ననే హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసు విచారణ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లన్నీ సర్కారు తీరును స్పష్టం చేస్తున్నాయి.
నిరుటి నష్టం రూ.7 వేల కోట్లకు పైనే
నిరుడు అకాల వర్షాలతో భారీగా పంట నష్టం వాటిల్లింది. 18 జిల్లాల్లో దాదాపు 5.10 లక్షల ఎకరాల్లో వరి, 7.75 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు దెబ్బతిన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వేలో తేలింది. కనీస మద్దతు ధరల ప్రకారం పంట నష్టాన్ని అంచనా వేస్తే రూ.7,219 కోట్ల ఇన్​పుట్ సబ్సిడీ అందించాలని లెక్కలేసింది. రైతులకు సాయం అందించేందుకు రూ.465 కోట్లు, ఇతర సహాయక చర్యల కోసం రూ.885 కోట్లు కావాలని అప్పట్లోనే కేంద్రానికి లేఖ రాసింది. విపత్తుల నిర్వహణ కింద ఇచ్చిన నిధుల్లో ఇన్‌‌ఫుట్‌‌ సబ్సిడీ కింద రూ.188 కోట్లు వాడుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కానీ వీటిని కూడా రైతులకు పంపిణీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్​లో పెట్టింది. కేంద్ర విపత్తు నిధికి రాష్ట్ర వాటా కలిపి రైతులను ఆదుకోవాల్సింది పోయి..  కనీసం పట్టించుకోలేదు. తాజాగా హైకోర్టు తీర్పుతో.. నిరుడు పంట నష్టపోయిన రైతులకు, కౌలుదారులకు ఇన్‌‌పుట్ సబ్సిడీ చెల్లించే అంశంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. రైతుబంధు స్కీమ్​ కింద గతేడాది  దాదాపు రూ.13 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. కానీ అకాల వర్షాలతో 7 కోట్ల విలువైన పంటలు నష్టపోయిన విషయాన్ని వెల్లడించకుండా బాధిత రైతుల నోట మట్టి కొట్టింది.
ఈ ఏడాది రూ.3 వేల కోట్లకుపైనే
పంట నష్టాన్ని రైతుబంధుకు ముడిపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. మూడేళ్లుగా పరిహారం చెల్లించకుండా దాటవేస్తోంది. దీంతో ఇప్పటికే 16 లక్షల మంది రైతులు నష్టపోయారు. ఈ ఏడాది కూడా అకాల వర్షాలు కొంపముంచాయి. మూడు దఫాలుగా పంట నష్టం వాటిల్లింది. రాష్ట్రంలో దాదాపు 12.80 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లుగా వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. జూన్, జులైలో కురిసిన వర్షాలకు దాదాపు 4.50 లక్షల ఎకరాల్లో, సెప్టెంబర్ మొదటి వారంలో మరో 6.20 లక్షల ఎకరాల్లో, చివరి వారంలో 2.10 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈ లెక్కన ఈ ఏడాది దాదాపు రూ.3 వేల కోట్లకుపైగా పంట నష్టం వాటిల్లింది. 33% మించి పంట నష్టపోయిన రైతులను గుర్తించి విపత్తు సహాయ నిధి నుంచి ఆదుకోవాలి. కానీ రైతు బంధు అమలు చేస్తున్నామనే సాకుతో మిగతా విపత్తులను పట్టించుకోకపోవటం రైతుల పాలిట శాపంగా మారింది.