ఒలింపిక్స్ లో ఫ్యాన్స్‌‌‌‌కు నో ఎంట్రీ

ఒలింపిక్స్ లో ఫ్యాన్స్‌‌‌‌కు నో ఎంట్రీ

ఖాళీ స్టేడియాలోన్లే ఒలింపిక్‌‌ గేమ్స్‌‌ 
ఆగస్టు 22 దాకా  టోక్యోలో ఎమర్జెన్సీ

టోక్యో: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌‌ ఫస్ట్‌‌ టైమ్‌‌ ఫ్యాన్స్‌‌ లేకుండా ఖాళీ స్టేడియాల్లో, ఎమర్జెన్సీ సిచ్యువేషన్‌‌లో జరగబోతున్నాయి. కరోనా కారణంగా ఇప్పటికే ఏడాది ఆలస్యంగా మొదలవుతున్న టోక్యో గేమ్స్‌‌కు ఫ్యాన్స్‌‌ను బ్యాన్స్‌‌ చేసినట్టు ఇంటర్నేషనల్‌‌ ఒలింపిక్‌‌ కమిటీ (ఐఓసీ), ఆర్గనైజర్స్‌‌ గురువారం ప్రకటించారు. దాంతో, ఈ మెగా ఈవెంట్​ను ఈసారి టీవీల్లోనే చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే, టోక్యోలో కరోనా కేసులు పెరుగుతున్నందున ఈ నెల 12 నుంచి ఆగస్టు 22వ తేదీ వరకూ జపాన్‌‌ ప్రభుత్వం వైరస్‌‌ ఎమర్జెన్సీ విధించింది. ఈ మేరకు హెల్త్‌‌ ఎక్స్‌‌పర్ట్స్‌‌తో మీటింగ్‌‌ తర్వాత జపాన్‌‌ ప్రధాని యొషిహిడె సుగా ప్రకటన చేశారు. దాంతో, ఈ నెల 23న మొదలై ఆగస్టు 8 వరకు జరిగే ఒలింపిక్స్‌‌లో మొత్తం గేమ్స్‌‌ ఎమర్జెన్సీలోనే కొనసాగనున్నాయి.  ఫారిన్‌‌ ఫ్యాన్స్‌‌పై  గత నెలలో నే నిషేధం విధించగా.. ఇప్పుడు లోకల్‌‌ ఫ్యాన్స్‌‌ను కూడా అనుమతించడం లేదని సుగా వెల్లడించారు. ఇండోర్‌‌, ఔట్‌‌ డోర్‌‌ గేమ్స్ అన్నీ ఖాళీ స్టేడియాల్లోనే జరుగుతాయని స్పష్టం చేశారు. ‘డెల్టా స్ట్రెయిన్‌‌ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని, దేశంలో ఈ వైరస్‌‌ మళ్లీ విజృంభించకుండా నివారణ చర్యలు వేగవంతం చేయాల్సి వచ్చింది. ఒలింపిక్స్‌‌కు  ప్రేక్షకులు లేకున్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇది వరకే చెప్పాను’ అని సుగా పేర్కొన్నారు. ఐఓసీ ప్రెసిడెంట్‌‌ థామస్‌‌ బాచ్‌‌ టోక్యోలో అడుగుపెట్టిన కొన్ని గంటల్లోనే  ఎమర్జెన్సీ  డిక్లరేషన్‌‌ రావడం విశేషం. 
బార్లు, రెస్టారెంట్లు క్లోజ్‌‌ చేసేందుకే...
వైరస్‌‌ కట్టడిలో భాగంగా టోక్యోలో  బార్లు, రెస్టారెంట్లు, ఆల్కహాల్‌‌ సర్వ్‌‌ చేసే కరోక్‌‌ పార్లర్స్‌‌ను మూసి వేసేందుకే ఎమర్జెన్సీ విధించినట్టు తెలుస్తోంది. ఆల్కహాల్‌‌ సర్వ్‌‌ చేయడం ఆపేస్తే.. ఒలింపిక్‌‌ రిలేటెడ్‌‌ ఫెస్టివల్స్‌‌ ఆగిపోతాయి. అప్పుడు మందు కోసం, పార్టీలు చేసుకోవడం కోసం  స్థానిక ప్రజలను బయటికి రాకుండా నిరోధించొచ్చని జపాన్‌‌ హెల్త్‌‌ మినిస్టర్‌‌ నొరిహిస చెప్పారు.  వాళ్లు ఇండ్లకే పరిమితం అయితే  గేమ్స్‌‌ కోసం వచ్చే అథ్లెట్లు, సపోర్ట్‌‌ స్టాఫ్‌‌, అఫీషియల్స్‌‌కు హెల్త్‌‌ రిస్క్‌‌ తగ్గుతుందని భావిస్తున్నారు.  మెగా గేమ్స్‌‌ కోసం 11 వేల మంది ఒలింపియన్స్‌‌, 4440 పారాలింపియన్స్‌‌, మరో పదివేల మంది అధికారులు, జడ్జీలు, స్పాన్సర్లు, మీడియా సిబ్బంది వస్తారని అంచనా వేస్తున్నారు. కాగా, ఒలింపిక్‌‌ విలేజ్‌‌లో ఉండేవాళ్లలో 80 శాతం  మంది ఇప్పటికే వ్యాక్సిన్‌‌ తీసుకున్నారని ఐఓసీ తెలిపింది.