- చివరిరోజు భారీగా దాఖలు
- నామినేషన్ సెంటర్లకు క్యూ కట్టిన అభ్యర్థులు
- బీ ఫామ్ కోసం ప్రయత్నాలు షురూ
హనుమకొండ/ మహబూబాబాద్/ జనగామ, వెలుగు: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టం ముగిసింది. శుక్రవారంతో నామినేషన్ల దాఖలకు గడువు ముగిసింది. దీంతో చివరరోజు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రెండు రోజుల కంటే చివరి రోజు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తరలివచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనుండగా, వివిధ పార్టీల నుంచి టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు ఒకటికిపైగా వార్డుల్లో నామినేషన్లు వేశారు. దీంతో నామినేషన్ సెంటర్లు కిటకిటలాడగా, ఒక్కో వార్డుకు సగటున పది వరకు నామినేషన్లు పడ్డాయి. కాగా, టికెట్ ఆశతో నామినేషన్లు వేసిన ఆశావహులు బీ ఫామ్ కోసం ప్రయత్నాలు షురూ చేశారు.
వార్డుకు సగటున పది..
మున్సిపల్ ఎన్నికలను అన్ని ప్రధాన పార్టీలు ఛాలెంజింగ్ గా భావిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటీ పడుతున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఒక్కో వార్డుకు సగటున పది వరకు నామినేషన్లు దాఖలయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీల్లో మొత్తంగా 260 వార్డులు ఉండగా, శుక్రవారం వరకు 2,630 నామినేషన్లు దాఖలయ్యాయి.
చివరి రోజు పార్టీల తరఫున టికెట్ ఆశించే నేతలతో పాటు ఇండిపెండెంట్లు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో పరకాల మున్సిపాలిటీకి శుక్రవారం ఒక్కరోజే 171 నామినేషన్లు దాఖలయ్యాయి. వర్ధన్నపేటలో 86, నర్సంపేట 191, జనగామ 197, స్టేషన్ ఘన్ పూర్ 121, ములుగు 134, భూపాలపల్లి 206, మహబూబాబాద్ లో 199, తొర్రూరు 144, కేసముద్రం 163, డోర్నకల్ 146, మరిపెడ మున్సిపాలిటీలో 142 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో ఓవరాల్ గా శుక్రవారం ఒక్కరోజే వివిధ పార్టీలకు చెందిన నేతలు 1,900 నామినేషన్లు
దాఖలు చేశారు.
బీ ఫామ్ కోసం ప్రయత్నాలు..
కౌన్సిలర్ టికెట్ ఆశతో నామినేషన్ దాఖలు చేసిన నేతలు బీ ఫామ్ కోసం తమ గాడ్ ఫాదర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ మేరకు నియోజకవర్గ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే కొంతమంది రెబల్స్, ఆశావహులు నియోజకవర్గ నేతల చుట్టూ తిరుగుతున్నారు. ఇదిలాఉంటే క్షేత్రస్థాయి పరిస్థితుల దృష్ట్యా పార్టీలు కూడా మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఈ మేరకు నియోజకవర్గ స్థాయి నేతలు గెలుపు గుర్రాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఎవరికి బీ ఫామ్ దక్కుతుందోనని టెన్షన్ నెలకొంది.
అధికారుల పరిశీలన
నర్సంపేట/ వర్ధన్నపేట : మున్సిపాలిటీ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ సెంటర్లను అధికారులు పరిశీలించారు. నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీ కేంద్రాల్లో వరంగల్ కలెక్టర్ సత్యశారద, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణితో కలిసి తనిఖీలు చేసి ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు.
తొర్రూరులో విజయం సాధించాలి
తొర్రూర్ లో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీలో 16 వార్డుల్లో మొత్తం కాంగ్రెస్ జెండా ఎగరాలని అన్నారు. పార్టీలో అందరు నాయకులు బాధ్యతతో పనిచేయాలని సూచించారు. ఇంటింటి ప్రచారం, బూత్ స్థాయి సమన్వయం, ప్రజా సమస్యలపై అవగాహన కల్పించడం ద్వారా పార్టీ బలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.
