ఆరోపణలు చేసేవాళ్లందర్నీ జైల్లో వేయలేం .. యూట్యూబర్‌‌‌‌ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య

ఆరోపణలు చేసేవాళ్లందర్నీ జైల్లో వేయలేం .. యూట్యూబర్‌‌‌‌ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య

న్యూఢిల్లీ: సోషల్‌‌ మీడియాలో ఆరోపణలు చేసిన అందరినీ జైల్లో వేయలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎన్నికలకు ముందు ఎంతమందిని జైల్లో వేస్తారని ప్రశ్నించింది. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌‌పై ఓ యూట్యూబర్‌‌‌‌ చేసిన అనుచిత వ్యాఖ్యల కేసును జస్టిస్‌‌ అభయ్‌‌ ఎస్‌‌ ఓకా, జస్టిస్‌‌ ఉజ్జల్‌‌ భూయాన్‌‌ బెంచ్‌‌ విచారించింది. యూట్యూబర్‌‌‌‌కు బెయిల్‌‌ మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది. 

2021లో సీఎం స్టాలిన్‌‌పై యూట్యూబర్ దురైమురుగన్‌‌ సత్తాయి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అతన్ని అరెస్ట్‌‌ చేశారు. అనంతరం అతనికి బెయిల్‌‌ రావడంతో మద్రాస్‌‌ హైకోర్టు ఆ ఉత్తర్వులను రద్దు చేసింది. బెయిల్‌‌ రద్దు ఉత్తర్వులను అతను సుప్రీంకోర్టులో సవాల్‌‌ చేశాడు. తమిళనాడు ప్రభుత్వం తరఫున సీనియర్‌‌‌‌ న్యాయవాది ముకుల్‌‌ రోహత్గీ వాదిస్తూ.. సీఎంపై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన సత్తాయి బెయిల్‌‌ను రద్దు చేయాలని కోరారు. 

మురుగన్‌‌ తనకు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేశాడని నిరూపించడానికి ఆధారాలు సమర్పించలేదని కోర్టు పేర్కొంది. బెయిల్‌‌పై ఉన్న యూట్యూబర్‌‌‌‌ అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఆదేశించాలన్న అభ్యర్థనను కూడా తోసిపుచ్చింది. ఎన్నికలకు ముందు యూట్యూబ్‌‌లో ఆరోపణలు చేసే ప్రతి ఒక్కరికీ జైల్లోకి నెట్టివేస్తే.. ఎంతమందికి జైలు శిక్ష పడుతుందో ఆలోచించండి అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.