
దేశంలో ప్రజాధరణ పొందిన చెల్లింపు వ్యవస్థ యూపీఐ. అయితే యూపీఐ చెల్లింపు రోజువారీ పరిమితులు సెప్టెంబర్ 15 నుంచి పెంచుతున్నట్లు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దీంతో ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్స్ ద్వారా చెల్లింపులు చేస్తున్న కోట్ల మంది ప్రజలకు కొత్త వెసులుబాటు అందుబాటులోకి రాబోతోంది.
NPCI తెస్తున్న మార్పులతో ప్రజలు తమ ఇన్సూరెన్స్ ప్రీమియం, లోన్ ఈఎంఐ, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, ప్రభుత్వ చెల్లింపులు, పెద్ద ట్రావెల్ బుక్కింగ్స్ వంటి బిగ్ టిక్కెట్ పేమెంట్స్ సులువుగా చేసుకోవచ్చు. కొత్త నిబంధనల ప్రకారం వ్యాపారులు ఒక రోజులో రూ.10 లక్షల వరకు ఆన్‌లైన్ చెల్లింపు చేయవచ్చు. అంటే ఇకపై పెద్ద చెల్లింపుల కోసం పదేపదే లావాదేవీలు చేయవలసిన అవసరం ఉండదు. ఇది ప్రధానంగా బిజినెస్ యూజర్లకు లేదా కార్పొరేట్ అకౌంట్లకు ఉపయోగం. అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే లావాదేవీల విషయంలో మాత్రం రోజువారీ పరిమితి గతంలో మాదిరిగా రూ.లక్ష అలాగే మార్పులు లేకుండా కొనసాగుతుందని తెలుస్తోంది.
గతంలో ఇన్సూరెన్స్ ప్రీమియం, ఈక్విటీ పెట్టుబడి పరిమితి రూ. 2 లక్షలుగా ఉండేది. కానీ దానిని ఇప్పుడు దానిని రూ. 5 లక్షలకు పెంచారు. దీనితో పాటు 24 గంటల వ్యవధిలో గరిష్టంగా రూ.10 లక్షల వరకు పేమెంట్స్ సాధ్యమవుతుంది. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు కోసం UPI వన్-టైమ్ లావాదేవీ పరిమితి ఇప్పుడు రూ. 5 లక్షలకు పెంచబడింది. అలాగే రోజులో గరిష్టంగా రూ.6 లక్షలు చెల్లించవచ్చు. ఇక ట్రావెల్ విషయంలో చెల్లింపుల రోజువారీ పరిమితి కూడా లక్ష రూపాయల నుంచి రూ.5 లక్షలకు పెంచారు.
బ్యాంకింగ్ సేవలలో టర్మ్ డిపాజిట్లకు డిజిటల్ ఆన్‌బోర్డింగ్ ఇప్పుడు రూ.5 లక్షల వరకు లావాదేవీలను అనుమతిస్తుండగా.. ఆభరణాల షాపింగ్ చెల్లింపులపై పరిమితి లక్ష నుంచి డబుల్ చేసి రూ.2 లక్షలకు పెంచారు. మెుత్తానికి యూపీఐ చెల్లింపుల పరిమితి పెంచటం వల్ల ఎలాంటి అదనపు ఛార్జీలు లేదా రుసుముల భారం ఉండబోదని పేమెంట్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. కేవలం డిజిటల్ లావాదేవీలను సులభరం చేయటమే దీని ఉద్దేశ్యం.