
- కేంద్ర జలశక్తి శాఖకు ప్రతిపాదనలు పంపిన ఎన్‌డబ్ల్యూడీఏ
హైదరాబాద్, వెలుగు: గోదావరి కావేరి (జీసీ) నదుల అనుసంధానంపై చర్చించేందుకు ఈ నెల 16న ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ సమావేశాన్ని నిర్వహించాలని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన్‌డబ్ల్యూడీఏ) యోచిస్తున్నది. దీనిపై ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖకు ఎన్‌డబ్ల్యూడీఏ సమాచారం పంపినట్టు తెలిసింది. ఇప్పటికే పలుమార్లు టాస్క్‌ఫోర్స్ మీటింగ్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పెట్టినా.. వివిధ కారణాలతో సమావేశం వాయిదా పడుతూ వస్తున్నది.
ప్రాజెక్టుపై తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఏపీ, తమిళనాడు, కర్నాటక, పుదుచ్చేరి, మహారాష్ట్రలతో ఇప్పటికే ఎన్‌డబ్ల్యూడీఏ ఎన్నో సమావేశాలను నిర్వహించినా.. ఎటూ తేలలేదు. రాష్ట్రాలు అభ్యంతరాలు తెలుపుతుండడంతో అడుగు ముందుకు పడడం లేదు. ఈ నేపథ్యంలోనే జీసీ లింక్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కేంద్రం.. స్వయంగా తానే రంగంలోకి దిగింది. కొద్ది నెలల క్రితం నిర్వహించిన సమావేశంలో.. రాష్ట్రాల అభ్యంతరాలపై కేంద్ర జలశక్తి శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఎవరికివాళ్లు ఎక్కువ వాటాలు కావాలంటే అన్ని నీళ్లను ఎక్కడి నుంచి తెచ్చిస్తారంటూ ప్రశ్నించింది. అవసరమైతే రాష్ట్రాలు ఇంట్రా లింకింగ్ (రాష్ట్రం లోపల చేపట్టే అనుసంధానం)కు సహకరిస్తామనీ చెప్పింది. దీనిపై అన్ని రాష్ట్రాల సెక్రటరీలతో సమావేశం నిర్వహిస్తామని ఆనాడు పేర్కొంది. అయితే, ఎప్పటికప్పుడు ఆ సమావేశం కాస్తా వాయిదా పడుతూ వస్తున్నది. ఇప్పుడు 16న నిర్వహించేందుకు కసరత్తులు చేస్తున్నది.