కృష్ణాలో మనకు 299 టీఎంసీలే..

కృష్ణాలో మనకు 299 టీఎంసీలే..
  • కొత్త ట్రిబ్యునల్ నీటి లెక్కలను తేల్చేదాకా ఇంతే   
  • క్యారీ ఓవర్ నీళ్లలోనూ 
  • మనకు నష్టం  
  • వరద నీళ్లను కూడా వాడుకోలేని దుస్థితి  

హైదరాబాద్‌‌, వెలుగు:  కృష్ణా నీళ్లలో మన కోటా 299 టీఎంసీలకే పరిమితం కానుంది. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏపీకే ఎక్కువ నీళ్లు దక్కాయి. అదే తరహా నీటి పంపకాలు కొత్త ట్రిబ్యునల్‌‌ వాటా తేల్చేవరకూ కొనసాగనున్నాయి. తాజాగా రూపొందించిన ప్రాజెక్టుల ఆపరేషన్‌‌ ప్రొటోకాల్‌‌తో ఏపీకి బాజాప్త ఎక్కువ నీళ్లు దక్కనున్నాయి. ఏపీ తమ వాటా నీళ్లతో పాటు వరద నీటిని మళ్లించుకుపోతుంటే.. మన రాష్ట్రానిది మాత్రం కోటా నీటిని కూడా వాడుకోలేని దుస్థితి. 
తాజాగా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) రెండు రాష్ట్రాల పరిశీలనకు పంపిన రూల్ కర్వ్స్ ప్రకారం కూడా.. కృష్ణా జలాల్లో మనకు 299 టీఎంసీల నీళ్లే దక్కుతున్నయి. ఇప్పుడు కూడా ఏపీకే ఎక్కువగా 512 టీఎంసీల నీళ్లు పోతున్నయి. రెండు రాష్ట్రాల నీటి వాటాలను కొత్త ట్రిబ్యునల్‌‌‌‌ తేల్చేవరకూ ఇవే కేటాయింపులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఏపీ కోరుకున్నట్టే శ్రీశైలంలో కనీస నీటిమట్టాన్ని 854 అడుగులుగా తేల్చడం కూడా మనకు మరో దెబ్బ. అలాగే క్యారీ ఓవర్‌‌‌‌ నీళ్లను మనకే ఇవ్వాలన్న డిమాండ్‌‌‌‌ ను కూడా లెక్కలోకి తీసుకోలేదు. ఈ నీళ్లలో ఏపీకి కూడా హక్కు కల్పించడంతో ఇందులోనూ మనకు నష్టమే జరిగింది. ఉమ్మడి ఏపీకి కృష్ణా నదిలో 811 టీఎంసీల నికర జలాలు ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత ఇందులో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల చొప్పున తాత్కాలికంగా పంపిణీ చేశారు. ఉమ్మడి ఏపీలో అప్పటికే పూర్తయిన ప్రాజెక్టుల ఆధారంగానే ఈ వాటాలు నిర్ణయించారు. బ్రజేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌ (కేడబ్ల్యూడీటీ-2)పై ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతోంది. దీంతో అంతకుముందే బచావత్‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌ (కేడబ్ల్యూడీటీ-1) చేసిన నీటి కేటాయింపుల్నే ప్రస్తుతానికి కొనసాగిస్తున్నారు. 
ప్రొటోకాల్ మార్చినా మనకే నష్టం 
కేంద్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ నిరుడు జూలై 15న గెజిట్‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌ జారీ చేసింది. అక్టోబర్‌‌‌‌ 14 నుంచి ఈ గెజిట్‌‌‌‌ అమల్లోకి వచ్చింది. గెజిట్‌‌‌‌లోని రెండో షెడ్యూల్‌‌‌‌లో చేర్చిన ప్రాజెక్టులను బోర్డు అధీనంలోకి అప్పగించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్‌‌‌‌ ప్రాజెక్టుల ఆపరేషన్‌‌‌‌ ప్రొటోకాల్ ను సీడబ్ల్యూసీ రూపొందించింది. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన తెలంగాణ.. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారమే ప్రొటోకాల్ ను తిరిగి రూపొందించాలని పట్టుబట్టింది. తెలంగాణ డిమాండ్ మేరకు.. శ్రీశైలం, నాగార్జున సాగర్ ఆపరేషనల్ ప్రొటోకాల్ ను సీడబ్ల్యూసీ మార్చి, రెండు రాష్ట్రాల పరిశీలనకు  పంపింది. ఇందులోనూ ఏపీకే ఎక్కువ లాభం జరుగుతోంది.  
వరద నీళ్లను పట్టించుకోవట్లే.. 
అన్ని ప్రాజెక్టులు నిండి వరద నీళ్లు సముద్రంలోకి పోతున్న రోజుల్లో ఏపీ ఏటా సగటున100 టీఎంసీలకు పైగా మళ్లించుకుంటోంది. ఒక్కోసారి అంతకు రెట్టింపు తరలించినా ఆ నీళ్ల లెక్కలు చెప్పడం లేదు. కానీ తెలంగాణకు వరద నీళ్లు తీసుకునే మెకానిజమే లేదు. కల్వకుర్తి నుంచి గరిష్టంగా 2,400 క్యూసెక్కులు, సాగర్‌‌‌‌ ఎడమ కాలువ నుంచి 1 టీఎంసీ వరకు మాత్రమే నీళ్లు తీసుకునే చాన్స్‌‌‌‌ ఉంది. ఇలా ఏటా10, 15 టీఎంసీలకు మించి మనం వరద నీళ్లను తీసుకోవడం లేదు. అదే ఎస్‌‌‌‌ఎల్బీసీ, పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే రోజుకు 3 టీఎంసీల వరకు వరద జలాలు తీసుకునే అవకాశం ఉండేది. కానీ ఆ ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తవుతాయో కూడా తెలియని పరిస్థితి ఉండటంతో తెలంగాణ కనీసం వరద నీళ్లనూ వాడుకోలేని దుస్థితిలో ఉంది. అయితే, ఇప్పుడు రూల్ కర్వ్స్ కోసం పట్టుబట్టి.. ఏపీకే నికర జలాల్లో లాభం జరిగేలా తెలంగాణ ప్రభుత్వం పరోక్షంగా సహకరించిందనే వాదనలూ వినిపిస్తున్నయి. 
ఇదే అఫీషియల్ అవుతుందా?  
వైఎస్‌‌‌‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్‌‌‌‌ రెగ్యులేటర్‌‌‌‌ డిశ్చార్జి కెపాసిటీ11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచారు. అదే సమయంలో శ్రీశైలం డ్యాంలో నీళ్లను తీసుకునేందుకు కనీస మట్టం ‘మినిమం డ్రాడౌన్ లెవెల్ (ఎండీడీఎల్)’ 834 అడుగుల వరకు ఉండగా, దానిని 854 అడుగులకు పెంచారు. తద్వారా రాయలసీమకు ఎక్కువ రోజులు నీళ్లు తీసుకునే కుట్రకు తెరతీశారు. శ్రీశైలం రూల్‌‌‌‌ కర్వ్స్‌‌‌‌లో ఎండీడీఎల్‌‌‌‌ 854 అడుగులుగా పేర్కొనడంతో అది ఇకపై అధికారికంగా ఖరారు అవుతుందనే ఆందోళన ఇరిగేషన్‌‌‌‌ వర్గాల్లో ఉంది. 
ఫోకస్ పెట్టకుంటే నష్టం తప్పదు: రిటైర్డ్​ ఇంజనీర్లు    
మన రాష్ట్రం ఏటా శ్రీశైలం, నాగార్జునసాగర్‌‌‌‌లలో కలిపి 45 టీఎంసీలు వాడుకోవడం లేదు. ఆ నీళ్లను క్యారీ ఓవర్‌‌‌‌గా భావించి మరుసటి ఏడాదికి ఇవ్వాలని కోరుతోంది. కానీ రూల్‌‌‌‌ కర్వ్స్‌‌‌‌లో ఆ నీటిపై రెండు రాష్ట్రాలకూ హక్కు ఉంటుందని తేల్చారు. దీంతో దీనిపైనా హక్కులు కోల్పోయే పరిస్థితి వచ్చింది. వీటిపై ఇరిగేషన్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ దృష్టి సారించకపోతే రాష్ట్రానికి భారీగా నష్టం తప్పదని రిటైర్డ్‌‌‌‌ ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు. కొత్త ట్రిబ్యునల్‌‌‌‌ ఏర్పడి, అది వాటాలు తేల్చేందుకు ఎన్నేండ్లు పడుతుందో తెలియదని, అప్పటి వరకు కృష్ణా నీళ్లల్లో ఈ అన్యాయం తప్పదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.