పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య సరిహద్దు వివాదం ఇప్పుడు యుద్ధ వాతావరణానికి దారితీసింది. ఈరోజు (ఫిబ్రవరి 27) పాక్ జరిపిన వైమానిక దాడుల తర్వాత, ఆఫ్ఘన్ దళాలు ప్రతిదాడి చేసి పాకిస్థాన్‌కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ఆఫ్ఘన్ మీడియా సంస్థ సంచలన ప్రకటన చేసింది.
ఏం జరిగిందంటే.. కాబూల్, కాందహార్ ప్రాంతాల్లో పాక్ విమానాలు దాడులు చేయడంతో, ఆఫ్ఘన్ గగనతలంలోకి ప్రవేశించిన ఒక జెట్‌ను తాము కూల్చేశామని ఆఫ్ఘనిస్థాన్ పేర్కొంటోంది. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కాలిపోతున్న విమాన శిథిలాలు కనిపిస్తున్నాయి. ఆ విమానం నంబర్ '85610' అని, అది పాక్ సైన్యానికి చెందినదని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వీడియో నిజమేనా కాదా అన్నది అధికారికంగా ధృవీకరించలేదు.
పాకిస్థాన్ ఏమంటోంది:
మేము ఉగ్రవాద స్థావరాల పై దాడులు చేసిన మాట వాస్తవమే కానీ, మా విమానం ఏదీ కూలిపోలేదని పాకిస్థాన్ స్పష్టం చేసింది. ఈ ఆరోపణలను ఇస్లామాబాద్ కొట్టిపారేసింది. మరోవైపు, పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. ఆఫ్ఘనిస్థాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోందని, దీనిపై తాము బహిరంగ యుద్ధం ప్రకటిస్తున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ ప్రతీకార దాడుల్లో 55 మంది పాక్ సైనికులను మట్టుబెట్టామని ఆఫ్ఘన్ రక్షణ శాఖ అంటోంది. గజాబ్ లిల్ హక్ అనే పేరుతో తాము జరిపిన ఆపరేషన్‌లో తాలిబాన్లకు భారీ నష్టం వాటిల్లిందని పాక్ మీడియా చెబుతోంది. ప్రస్తుతానికి ఇరు దేశాలు ఒకరిపై ఒకరు ప్రతీకార ప్రకటనలు చేసుకుంటున్నాయి. అయితే ఈ యుద్ధ విమానం కూలిందనే వార్తపై పూర్తి స్థాయి స్పష్టత రావాల్సి ఉంది.
