బంగ్లాపై విజయం..సెమీస్ చేరిన పాక్

బంగ్లాపై విజయం..సెమీస్ చేరిన పాక్

టీ20 వరల్డ్ కప్ 2022లో పాక్ సెమీస్ చేరింది. సెమీస్ చేరాలంటే ఖచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్లో విజయం సాధించింది. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో పాక్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 128 పరుగుల టార్గెట్ను పాకిస్తాన్ మరో 11 బంతులుండగానే ఛేదించి సెమీస్లో అడుగుపెట్టింది. అటు సౌతాఫ్రికాతా జరిగిన మ్యాచ్లో నెదర్లాండ్స్ విజయం సాధించడంతో పాక్ సెమీస్ చేరుకునే అవకాశం దక్కింది. 

చెలరేగిన పాక్ బౌలర్లు...
సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పాక్ బౌలర్లు చెలరేగారు. సెమీస్ రేసు నుంచి సౌతాఫ్రికా వైదొలగడంతో ...పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. అయితే ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. 20 ఓవర్లలో 8 వికెట్లకు 127 పరుగులే చేయగలిగింది. ఓపెనర్ నజ్ముల్ హొస్సేన్ శాంటో 48 బంతుల్లో 7 ఫోర్లతో 54 పరుగులతో రాణించాడు. అయితే కీలకమైన మ్యాచ్లో  మరో ఓపెనర్ లిటన్ దాస్ విఫలమయ్యాడు. అటు వన్ డౌన్లో వచ్చిన సౌమ్యా సర్కార్తో కలిసి శాంటో రెండో వికెట్ కు 52 పరుగులు జోడించాడు. దీంతో బంగ్లా 10 ఓవర్లకు ఒక వికెట్ నష్టానికే70 పరుగులు చేసింది.  10 ఓవర్ల తర్వాత పాక్ బౌలర్లు పుంజుకున్నారు. దీంతో బంగ్లాదేశ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. శాంటో, సౌమ్యా సర్కార్, కెప్టెన్ షకీబ్ అల్ హసన్ , మొసాదెక్ హొస్సేన్ , నురుల్ హసన్ , తస్కిన్ అహ్మద్ , నసుమ్ అహ్మద్  పెవిలియన్కు క్యూ కట్టారు. అయితే చివర్లో అఫిఫ్ హొస్సేన్ 24 పరుగులతో చెలరేగడంతో... బంగ్లా మోస్తరు స్కోరు సాధించింది.  పాక్ బౌలర్లలో  షాహీన్ షా ఆఫ్రిది 4 వికెట్లతో సత్తా చాటాడు. షాదాబ్ ఖాన్ 2 వికెట్లు, ఇఫ్తికార్ అహ్మద్, హారిస్ రవూఫ్ తలా ఓ వికెట్ పడగొట్టారు. 

రాణించిన ఓపెనర్లు..
128 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన పాక్కు ఓపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చారు. ఓపెనర్ రిజ్వాన్ 32 బంతుల్లో 32 పరుగులు, కెప్టెన్ బాబర్ ఆజమ్ 33 బంతుల్లో 25 పరుగులతో రాణించారు. తొలి వికెట్కు వీరిద్దరు 57 పరుగులు జోడించారు. ఆజమ్ ఔటైన తర్వాత వచ్చిన నవాజ్ రనౌట్గా వెనుదిరిగాడు. కొద్దిసేపటి తర్వాత రిజ్వాన్ కూడా పెవీలియన్ చేరాడు. ఈ సమయంలో హారీస్, షాన్ మసూద్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. హారీస్ 18 బంతుల్లో 31 పరుగులతో చెలరేగాడు. అతనికి షాన్ మసూద్ 14 బంతుల్లో 24 పరుగులు చేసి సహకరించాడు. చివర్లో పాక్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయినా...షాన్ మసూద్ ఆజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. దీంతో పాక్ 18.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసి విజయం సాధించింది. ఫలితంగా సెమీస్ చేరింది.