గుజరాత్​లో కింగ్ మేకర్​లు పాటీదార్​లే

గుజరాత్​లో కింగ్ మేకర్​లు పాటీదార్​లే
  • గుజరాత్​లో కింగ్ మేకర్​లు పాటీదార్​లే
  • మొత్తం ఓటర్లలో18 శాతం వీళ్లే 

అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పాటిదార్​ల ఓట్లే కీలకం కానున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ పవర్​లోకి రావాలనేది వీళ్లు వేసిన ఓట్లే డిసైడ్ చేయనున్నాయి. గుజరాత్ లో 4.90 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వీరిలో దాదాపు 18 శాతం మంది పాటీదార్​లే ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం 182 అసెంబ్లీ సెగ్మెంట్లలో 40 నుంచి 50 చోట్ల ఈ కమ్యూనిటీ వాళ్లే గెలుపును డిసైడ్ చేసేంత స్థాయిలో ఉన్నారు. దీంతో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పాటీదార్​లే అసలు సిసలు కింగ్ మేకర్​లుగా నిలుస్తారని విశ్లేషకులు చెప్తున్నారు. 2017 ఎన్నికల సమయంలో పాటీదార్​లు ఓబీసీ కోటా కోసం ఉద్యమం చేస్తుండటం, డిమాండ్లకు ఒప్పుకోని బీజేపీపై కోపంగా ఉండటంతో బీజేపీపై భారీగానే ఎఫెక్ట్ పడింది. అప్పట్లో పాటీదార్​ల ఉద్యమానికి నాయకత్వం వహించిన హార్దిక్ పటేల్ కాంగ్రెస్ లో చేరి, బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. దీంతో అధికార బీజేపీ 99 సీట్లు సాధించి స్వల్ప మెజార్టీతో అధికారాన్ని నిలబెట్టుకుంది. పాటీదార్​ల మద్దతుతో కాంగ్రెస్ 77 సీట్లను గెలుచుకుంది. గత ఎన్నికల్లో 44 మంది పాటీదార్ వర్గం 

వాళ్లే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.  
టికెట్లలో పాటీదార్​లకే ప్రాధాన్యం 

రాష్ట్రంలో పాటీదార్​లు చాలా కీలకం కాబట్టే.. బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీలు టికెట్లలో వీరికి ప్రాధాన్యం ఇచ్చాయి. కాంగ్రెస్ 40 మందికి టికెట్లు ఇస్తే.. బీజేపీ అంతకన్నా ఒకటి ఎక్కువగా 41 మంది పాటీదార్​లను బరిలోకి దింపింది. ఆప్ కూడా పాటీదార్​ల ప్రాబల్యం ఉన్న అనేక చోట్ల వారికే టికెట్లు ఇచ్చింది. అయితే, ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ పాటీదార్​లనే పోటీలో పెట్టిన అసెంబ్లీ స్థానాలు 30 వరకూ ఉన్నాయి. కానీ పోయిన సారి తప్ప మిగతా ఎన్నికల్లో దాదాపు 85% మంది పాటీదార్ లు బీజేపీ వైపే మొగ్గారని, ప్రస్తుతం ఈ సీట్లలో కూడా రూలింగ్ పార్టీకే ఎక్కువ చాన్స్ ఉందని చెప్తున్నారు.

ముగిసిన ప్రచారం.. రేపే సెకండ్ ఫేజ్ పోలింగ్

గుజరాత్ అసెంబ్లీ రెండో విడత ఎన్నికలకు ప్రచారం శనివారం నాటితో ముగిసింది. మొదటి విడతలో 89 సీట్లకు ఈ నెల 1న పోలింగ్ జరగగా.. రెండో విడతలో మిగిలిన 93 సీట్లకు సోమవారం పోలింగ్ నిర్వహించనున్నారు. మొదటి విడతలో 63.31% పోలింగ్ నమోదైంది. రెండో విడతలో కూడా బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీలు జోరుగా ప్రచారం చేశాయి. ఈ విడతలో ఇండిపెండెంట్లు సహా 60 పార్టీలకు చెందిన 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అహ్మదాబాద్ లోని ఘట్లోదియా సీటు నుంచి సీఎం భూపేంద్ర పటేల్, వీరంగామ్ నుంచి హార్దిక్ పటేల్, గాంధీనగర్ సౌత్ నుంచి అల్పేశ్ ఠాకూర్ వంటి వారు పోటీలో ఉన్నారు. రెండో విడతతో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తి కానుంది. ఈ నెల 8న హిమాచల్ ప్రదేశ్​తో పాటు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు.

2022లో మారిన సీన్

గుజరాత్​లో పాటీదార్ వర్గానికి చెందిన భూపేంద్ర పటేల్​ను సీఎంగా చేయడంతో బీజేపీ చాలా వరకూ ఈ కమ్యూనిటీ వాళ్లను ఆకర్షించగలిగింది. అలాగే ఈబీసీలకు 10%  రిజర్వేషన్​లతో బీజేపీపై పాటీదార్​ల ఆగ్రహం దాదాపుగా పోయింది. పాటీదార్ లలో కీలక నేతగా ఎదిగిన హార్దిక్ పటేల్ ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరడం కూడా కలిసిరానుంది. మరోవైపు పాటీదార్​లు 2017లో తప్ప మిగతా ఎన్నికల్లో ప్రతిసారీ బీజేపీ వైపే ఎక్కువగా మొగ్గు చూపార ని విశ్లేషకులు అంటున్నారు. ఈసారి రిజర్వేషన్ అంశంకూడా పరిష్కారం కావడంతో బీజేపీనే ఆదరిస్తారని పేర్కొంటున్నారు.