కోల్ కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్ వైఫల్యాలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోని డార్జిలింగ్ జిల్లా పర్యటనకు వచ్చిన తనకు సరైన ప్రొటోకాల్ పాటించకపోవడంపై రాష్ట్రపతి శనివారం అసంతృప్తి వ్యక్తం చేశారు. "రాష్ట్రపతి ఒక రాష్ట్రానికి వచ్చినప్పుడు సీఎం, మంత్రులు రావాలి. కానీ వారు రాలేదు. నేను కూడా బెంగాల్ బిడ్డనే. మమతా దీదీ నా చెల్లెలు వంటివారు.
ఆమెకు నాపై కోపం ఉందో ఏమో, నాకు తెలియదు" అని రాష్ట్రపతి అన్నారు. అంతర్జాతీయ సంతాల్ సదస్సు వేదికను ట్రాఫిక్ ఇబ్బందుల నెపంతో మార్చడంపై కూడా ముర్ము మండిపడ్డారు. "బిధాన్‌నగర్‌లో కార్యక్రమం జరిగి ఉంటే ఎక్కువ మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండేది. కానీ అక్కడ సమావేశానికి ఎందుకు అనుమతించలేదో అర్థం కావడం లేదు" అని అన్నారు.
