
కల్తీ సారా నలుగురిని బలితీసుకుంది. మరో 23 మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వీరందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో చోటు చేసుకుంది.
మరక్కనం ఏకియార్ ప్రాంతంలో మే 13వ తేదీన శనివారం కొందరు వ్యక్తులు కల్తీ సారా తాగారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత 27 మంది అపస్మారక స్థితిలో పడిపోయారు. వారిని ముండియంబాక్కం, మరక్కనం, పుదుచ్చేరి జిబ్‌మార్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ సురేష్, శంకర్, తరణివేల్, రాజమూర్తి మృతి చెందారు.
జిప్‌మార్, పిమ్స్ ఆసుపత్రుల్లోని సురేష్, శంకర్, తరణివేల్ మృతదేహాలకు మంత్రులు పొన్ముడి, సెంజి మస్తాన్ నివాళులర్పించారు. అలాగే నార్త్ జోన్ ఐజి కన్నన్, జిల్లా కలెక్టర్ పళని, జిల్లా ఎస్పీ, పుదుచ్చేరి రాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నాయకుడు శివ కూడా మృతదేహాలకు నివాళులర్పించారు. ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ విచారం వ్యక్తం చేసినట్లు మంత్రి పొన్ముడి తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఆదేశించినట్లు చెప్పారు. ఆసుపత్రిలో చేరిన వారికి రూ. 50 వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ..దర్యాప్తు చేపట్టారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎన్ శ్రీనాథ ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నారు. కల్తీ సారా అమ్మకానికి సంబంధించిన తదుపరి విచారణ కోసం కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.