ఇలా చేస్తే.. మీ కుటుంబం మొత్తానికి తిరుమలలో ఉచిత బ్రేక్ దర్శనం

ఇలా చేస్తే.. మీ కుటుంబం మొత్తానికి తిరుమలలో ఉచిత బ్రేక్ దర్శనం

టీటీడీ పాలక మండలి సంచలన నిర్ణయాలు ప్రకటించింది. యువతలో సనాతన ధర్మం, హైందవ ధర్మవ్యాప్తి చేసేందుకు ప్రత్యేకంగా పలు కార్యక్రమాలను తీసుకువచ్చేందుకు నిర్ణయించింది.ఈ మేరకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన పాలక మండలిలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

యువ‌త‌లో హైంద‌వ స‌నాత‌న ధ‌ర్మ వ్యాప్తి కోసం శ్రీ‌వారి ఆల‌యం నుండే తొలి అడుగు వేస్తున్నామ‌ని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా రామ‌కోటి త‌ర‌హాలో గోవింద కోటి రాసిన 25 ఏళ్ల లోపు వారికి వారి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఒక‌సారి తిరుమ‌ల స్వామివారి బ్రేక్ ద‌ర్శనం క‌ల్పిస్తామ‌ని వెల్లడించారు. 

27 మంది సభ్యులు హాజరైన పాలకమండలి తొలి సమావేశంలోనే తిరుగులేని నిర్ణయాలు ప్రకటించారు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి. ఈ సారి ఆయన అందుకున్న కొత్త నినాదం యువ గోవిందం. గోవింద కోటి రాస్తే కుటుంబం మొత్తానికి వీఐపీ బ్రేక్‌ దర్శనం.. పది లక్షల మార్లు గోవింద కోటి రాస్తే ఒక్కరికి దర్శనం కల్పించాలని నిర్ణయించింది టీటీడీ ధర్మకర్తల మండలి. భగవద్గీత సారాంశాన్ని 20 పేజీల పుస్తకంగా ముద్రించి.. తెలుగు నాట అన్ని విద్యాలయాల్లో పంచిపెట్టాలనేది టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి తీసుకున్న మరో కీలక నిర్ణయం. మొత్తంగా యువతలో ఆధ్యాత్మిక చింతన పెంచాలని, ఈవిధంగా సనాతన ధర్మాన్ని రాబోయే తరాలకు దగ్గరగా తీసుకెళ్లాలని కంకణం కట్టుకుంది టీటీడీ ధర్మకర్తల మండలి .

మరోసారి భూమన కరుణాకర రెడ్డి సంచలన నిర్ణయాలు..

 ఈ నిర్ణయంతో టీటీడీలో మరోసారి తనదైన ముద్రను వేసుకోబోతున్నారు కొత్త ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి. తన అధ్యక్షతన జరిగిన మొదటి సమావేశంలోనే ఆ మేరకు సంకేతాలిచ్చేశారు. గతంలో తను ఛైర్మన్‌గా ఉన్నప్పుడు దళిత గోవిందం..  కల్యాణమస్తు లాంటి విప్లవాత్మక నిర్ణయాలతో టీటీడీలో చైతన్యం నింపారు భూమన. ఇప్పుడు రెండో దఫా… యువ గోవిందం పేరుతో మరో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. యువతలో హైందవ భక్తివ్యాప్తిని పెంపొందించడం టీటీడీ ధ్యేయం అంటున్నారు. హైందవుల్లో రామకోటి రాయడం గొప్ప సంప్రదాయం. అదే కోవలో గోవింద కోటి ఎందుకు రాయకూడదు.. వెంకటేశ్వరుని ఆదేశంగా దాన్ని ఎందుకు పాటించకూడదు అని ప్రశ్నిస్తున్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, చిరుతల కలకలం, భక్తుల భద్రతపై తీసుకోవాల్సిన చర్యలు, టీటీడీ ఉద్యోగుల ఇంటి స్థలాల పంపిణీ.. ఈ ఎజెండాతో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశం.. యువ గుండెల్లో సనాతన ధర్మం నాటడమే లక్ష్యంగా చర్చించారు.