ఒకేసారి 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్న మోడీ

ఒకేసారి 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్న మోడీ
  • 8 మెడికల్ కాలేజీలు పూర్తిగా కేంద్రం నిధులతో కట్టినవి

న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో రేపు సోమవారం ఒకేసారి 9  మెడికల్ కాలేజీలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ప్రారంభించనున్నారు. ఘాజిపూర్, మీర్జాపూర్, జౌన్‌పూర్‌, సిద్ధార్థ్‌ నగర్‌, ఈటా, హర్దోయి, ప్రతిప్‌ఘడ్‌, ఫతేపూర్‌, డియోరియాలలో ఏర్పాటు చేసిన మెడికల్‌ కాలేజీలను ప్రారంభిస్తున్నారు. ఇందులో విశేషమేమిటంటే  వీటిలో 8 కాలేజీలు కేంద్ర ప్రభుత్వం తన నిధులతో నిర్మించగా, రాష్ట్ర ప్రభుత్వం ఒక కాలేజీని మాత్రమే నిర్మించింది. కేంద్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక పథకం కింద వెనుకబడిన జిల్లాల్లో ఈ మెడికల్ కాలేజీలను నిర్మించారు. 
ఈ మెడికల్ కాలేజీలతోపాటు తన నియోజకవర్గంలో ఏకంగా రూ. 5,200 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా రేపు ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి పనులను ప్రధాని మోడీ ప్రారంభించనుండడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కరోనా నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ సహా మొత్తం 10 రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టి 17,788 గ్రామీణ ఆస్పత్రుల్లో, 11,024 పట్టణ ఆస్పత్రుల్లో వసతులు, సిబ్బంది నియామకానికి అవకాశాలు కల్పించింది.