వైన్స్ టెండర్లలో మంత్రులు!

వైన్స్ టెండర్లలో మంత్రులు!
  • ఇప్పటికే ఏడు వేలు దాటిన దరఖాస్తులు ఈ నెల 18 వరకు చాన్స్
  • టార్గెట్ 80 వేల అప్లికేషన్లు.. రూ.2 వేల కోట్లు
  • బంధువులు, అనుచరులతో అప్లికేషన్లు వేయిస్తున్న లీడర్లు 
  • లిక్కర్ సేల్స్ పెరగడం, ఎలక్షన్లు ఉండడంతో పోటీ

 

 

హైదరాబాద్, వెలుగు: వైన్ షాపుల కోసం పొలిటికల్ లీడర్లు పోటీ పడుతున్నారు. టెండర్లు దక్కించుకునేందుకు బంధువులు, అనుచరులతో అప్లికేషన్లు వేయిస్తున్నారు. ఏకంగా మంత్రులు మొదలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, వివిధ పార్టీల చోటామోటా లీడర్లు కూడా తమ వాళ్లతో దరఖాస్తు చేయిస్తున్నారు. రాష్ట్రంలో లిక్కర్ సేల్స్ పెరగడంతో పాటు ఈసారి అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో భారీగా స్టాక్ అమ్ముకోవచ్చని భావిస్తున్నారు. ఒకవేళ డిసెంబర్​లో ఎన్నికలు జరిగితే, అమ్మకాలకు కనీసం 10 రోజుల టైమ్ దొరికినా పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని ఆశిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,620 వైన్స్​లకు ఈ నెల 4 నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే 7వేలకు పైగా అప్లికేషన్లు వచ్చినట్టు తెలిసింది. దరఖాస్తులకు ఈ నెల 18 దాకా అవకాశం ఉంది. 2021లో టెండర్లకు మొత్తం 67,849 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో చివరి రెండ్రోజుల్లోనే 30 వేల దరఖాస్తులు వచ్చాయి. ఈసారి కూడా గడువు తేదీ దగ్గరపడే కొద్దీ ఎక్కువ అప్లికేషన్లు వస్తాయని ఎక్సైజ్ ఆఫీసర్లు చెబుతున్నారు. కాగా, ఈసారి 70 వేల నుంచి 80 వేల దరఖాస్తులు వచ్చేలా చూడాలని అధికారులకు ప్రభుత్వం టార్గెట్ పెట్టింది.  

లీడర్ల చేతుల్లోనే 40 శాతం వైన్స్

రాష్ట్రంలో మొత్తం 2,620 వైన్స్ ఉన్నాయి. ఇందులో గౌడ్లకు 15, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. ఈ లెక్కన గౌడ్లకు 393, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 దుకాణాలు కేటాయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న వైన్స్​లో 40 శాతం లీడర్ల చేతుల్లోనే ఉన్నాయి. లీడర్లు తమకు కావాలనుకున్న చోట ముగ్గురు, నలుగురితో.. ఎక్కువ డిమాండ్​ ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ అప్లికేషన్లు కొనుగోలు చేయించి డ్రాలో దక్కించుకుం టున్నారు. రిజర్వేషన్ కేటగిరీలో ఎక్కువ సంఖ్యలో అప్లికేషన్లు వచ్చే అవకాశం లేకపోవడంతో ముందే ఆయా కేటగిరీకి చెందినోళ్లతో మాట్లాడుకుంటున్నారు. ‘అప్లికేషన్​ ఫీజు కడ్తం.. అంతే మొత్తం వ్యక్తిగతంగా ఇస్తాం’ అని చెప్పి వాళ్లతో అప్లికేషన్లు వేయిస్తున్నారని తెలిసింది. 

ఎన్నికల కోసం ముందస్తు టెండర్లు.. 

ఎక్సైజ్​ ఆదాయంపై రాష్ట్ర సర్కార్ భారీగా ఆశలు పెట్టుకున్నది. ఎన్నికల వేళ ముఖ్యమైన స్కీములకు నిధుల కోసమే వైన్స్ టెండర్లు ముందస్తుగా నిర్వహిస్తున్నది. నిజానికి డిసెంబర్ నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ మొదలుకావాలి. కానీ ఈసారి ప్రభుత్వం ముందస్తుగా అప్లికేషన్లు తీసుకుంటున్నది. లక్కీ డ్రాలో టెండర్లు దక్కించుకున్న వైన్స్ యజమానులు ఎక్సైజ్ డ్యూటీలో ఫస్ట్ ఇన్​స్టాల్​మెంట్ కూడా ఇదే నెల 22లోపు చెల్లించాలి. కొత్త దుకాణాలు మాత్రం డిసెంబర్ నుంచే అందుబాటులోకి వస్తాయి. అటు అప్లికేషన్లు, ఇటు ఎక్సైజ్ డ్యూటీతో మొత్తంగా రూ.2 వేల కోట్ల ఆదాయం రాబట్టుకోవాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నది. గతంలో అప్లికేషన్ల ద్వారా  రూ.1,356 కోట్ల ఆదాయం రాగా, ఈసారి అంత కంటే ఎక్కువ రావాలని అధికారులకు ఆదేశా లిచ్చింది. కాగా, ఈసారి కూడా వాక్‌ ఇన్‌ స్టోర్లలో లిక్కర్‌, బీర్లకు తోడు పెగ్‌మేకర్‌, వాటర్‌ బాటిల్స్‌, ఐస్‌ క్యూబ్స్‌, ఐస్‌ క్యూబ్‌ బకెట్స్‌, సోడా, సాఫ్ట్‌ డ్రింక్స్‌, కూడా దొరకనున్నాయి. వాకిన్‌ స్టోర్స్‌ మిగతా వైన్స్‌ కంటే అదనంగా రూ.5 లక్షల ఫీజు చెల్లించాలి.

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలు కలిసి 40 చోట్ల తమ అనుచరులతో వైన్స్​ కోసం అప్లికేషన్లు వేయించినట్టు తెలిసింది. ఏపీ బార్డర్​కు దగ్గరగా ఉండే సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వైన్స్ దక్కించుకునేందుకు ఇద్దరు మంత్రులు ఎక్కువ అప్లికేషన్లు వేయిస్తున్నారు. ఈ ప్రాంతాల నుంచి ఏపీకి అక్రమంగా లిక్కర్ సప్లైకి అవకాశం ఉంది. నిజామాబాద్ జిల్లాలో మాజీ ఎంపీ ఒకరు 10 వైన్స్​కు 10 చొప్పున అప్లికేషన్లు తీసుకోవాలని తన సన్నిహితులకు చెప్పినట్టు సమాచారం. ఇక రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్​ మల్కాజ్​గిరి జిల్లాల్లోనైతే కింది స్థాయి నుంచి పైస్థాయి లీడర్ల వరకు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు.