- విద్యార్థి దశ నుంచి అనేక ఉద్యమాలు చేశా: ఆర్. కృష్ణయ్య
ముషీరాబాద్, వెలుగు: విద్యార్థి దశ నుంచే తాను అనేక ఉద్యమాలు చేపట్టి విజయం సాధించానని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. బీసీ జాతి అభివృద్ధి, చైతన్యం కోసం బీసీ రిజర్వేషన్లను సాధించడమే తన అంతిమ లక్ష్యమని, ఇందుకోసం ఎక్కడికైనా పోతానని స్పష్టం చేశారు. పోరాడితేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే తనకు ఆవేశం వస్తున్నదన్నారు. బుధవారం హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆరెకటిక అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఆరెకటికల సర్పంచుల ఆత్మీయ సన్మాన సభ జరిగింది. ఈ సభకు ఆర్.కృష్ణయ్య, ప్రొఫెసర్ కోదండరాం, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ హాజరై కొత్త సర్పంచులను సత్కరించి, అభినందించారు.
కృష్ణయ్య మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చి 78 ఏండ్లయినా బీసీలకు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో అన్యాయం జరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలన రంగంలో బీసీలకు 15 శాతం కూడా ప్రాధాన్యత దక్కకపోవడం బాధాకరమన్నారు. జనాభా ప్రకారం బీసీలకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించే వరకు విశ్రమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. కోదండరాం మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉంటూ ప్రభుత్వం ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు.
కొంత ముందు వెనక కాంగ్రెస్ ప్రభుత్వంలో సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆరెకటిక అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ఆరెకటికల అభివృద్ధికి ప్రభుత్వం రూ.500 కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు.
