
- జూన్ 2 నుంచి 9 దాకామంజూరు పత్రాలు పంపిణీ: డిప్యూటీ సీఎం భట్టి
- 10 నుంచి15వ తేదీ వరకుశిక్షణ కార్యక్రమాలు..ఆ తర్వాత యూనిట్ల గ్రౌండింగ్
హైదరాబాద్, వెలుగు: రాజీవ్ యువ వికాసం స్కీమ్ ద్వారా అక్టోబర్ 2 నాటికి 5లక్షల మందికి దశలవారీగా లబ్ధి చేకూరేలా ప్రణాళిక రూపొందించినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. జూన్ 2 నుంచి 9 వరకు మంజూరు పత్రాలు పంపిణీ చేస్తామని, 15 తర్వాత రాజీవ్ యువ వికాసం యూనిట్ల గ్రౌండింగ్ ఉంటుందని వెల్లడించారు. మంగళవారం సెక్రటేరియెట్లో రాజీవ్ యువ వికాసం స్కీమ్ అమలు ప్రగతిని డిప్యూటీ సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 10 నుంచి 15 వరకు జిల్లా, నియోజకవర్గస్థాయిలో ఒకే సారి రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రారంభించి.. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 నాటికి లక్ష్యంగా పెట్టుకున్న రూ.8 వేల కోట్లతో 5 లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించాలని ఆదేశించారు.
ప్రతి నెలా జిల్లా ఇన్చార్జ్ మంత్రులు, కలెక్టర్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. రాజీవ్ యువ వికాసంలో పట్టణ ప్రాంతాల్లోని యువత గిగ్ వర్కర్లుగా ఉపాధి పొందేందుకు ద్విచక్ర వాహనాల కొనుగోలుకు అవకాశం ఇవ్వాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. సంక్షేమ శాఖల కార్పొరేషన్ చైర్మన్ల వద్దకు వచ్చిన దరఖాస్తులన్నిటినీ పరిశీలించి సంబంధిత జిల్లా కలెక్టర్లకు పంపేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్సీ కార్పొరేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయాదేవి, మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ యాస్మిన్ భాషా, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు.
తొలుత రూ.లక్ష లోపు యూనిట్లకు సబ్సిడీ
రాజీవ్ యువ వికాసం పథకంలో తొలి విడత రూ.లక్షలోపు యూనిట్లకు సబ్సిడీ ప్రొసీడింగ్స్ ఇవ్వనున్నారు. ఆ తరువాత దశలవారీగా రూ.4 లక్షల యూనిట్ వరకు ఇవ్వనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ పథకంలో ఎక్కువ మంది రూ.2 లక్షల నుంచి 4 లక్షల విలువైన యూనిట్లకే అప్లై చేసుకున్నారు. ఈ యూనిట్లకు 70% (గరిష్ఠంగా రూ.2.80 లక్షలు) వరకు సబ్సిడీ రానుంది. మొత్తం దరఖాస్తుల్లో 76.46 శాతం ఈ కేటగిరీవే ఉన్నాయి. ఈ యూనిట్లతోనే మెరుగైన స్వయం ఉపాధి అవకాశాలు పొందొచ్చని నిరుద్యోగులు భావిస్తున్నారు. 100% సబ్సిడీకి సంబంధించిన రూ.50 వేల రుణాలకు కేవలం 39 వేల దరఖాస్తులు వచ్చాయి. రోజువారీ చిన్న వ్యాపారాలకు ఈ రుణాలు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావించినా.. యువత వీటిపట్ల పెద్దగా ఆసక్తి చూపలేదు. రూ.50 వేల నుంచి లక్షలోపు రుణాలకు (90% సబ్సిడీ) 93 వేల మంది అప్లయ్ చేసుకున్నారు.