కొలువుల కోసం పోరాడితే అరెస్టులు చేస్తారా..?

 కొలువుల కోసం పోరాడితే అరెస్టులు చేస్తారా..?
  • కొలువుల కోసం పోరాడితే అరెస్టులు చేస్తారా 
  • మా రాజ్యం వచ్చాక మీ అంతు చూస్తాం

హైదరాబాద్: కొలువుల కోసం పోరాడితే అరెస్టులు చేస్తారా అని ప్రశ్నించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. గురువారం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. సర్కార్ తీరుతోనే రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్నారు. ఇంటికో ఉద్యోగం ఏమైందన్న రేవంత్.. కేసీఆర్ పరిపాలనలో నిరుద్యోగులు ఉపాధిహామీ కూలీలుగా మారారన్నారు. ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో నోటిఫికేషన్లు లేవని.. కేసీఆర్ కుటుంబంలో వేల కోట్లు సంపాదింస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో లక్షా 90 వేల కొలువులు ఖాళీగా ఉన్నా.. ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. ఉద్యోగాల కోసం యువత ఎదురుచూస్తున్నారని.. వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. ఎంతో మంది యువకుల ఆత్మబలిదానాలతోనే తెలంగాణ వచ్చిందన్నారు. కానీ ఇప్పుడు యువకులకే అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమన్న రేవంత్ .. మా రాజ్యం వచ్చాక మీ అంతు చూస్తామన్నారు.  

రాష్ట్ర సంపదను కేసీఆర్ కొల్లగొట్టారని.. ఓయూ విద్యార్థులు నిరుద్యోగ దినోత్సవం చేస్తే.. టీఆర్ఎస్ గూండాలు దాడి చేశారని తెలిపారు. డీజీపీ ఫోన్ ఎత్తడం లేదని, ఇంత బలుపు ఎందుకు? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మేం తలుచుకుంటే మీరు రోడ్లపై తిరగలేరని.. దరిద్రుడు సీఎం కావడం వల్లే నిరుద్యోగుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. యువత ఆత్మహత్యలు చేసుకుంటుంటే మూడ్రోజుల వేడుకలు అవసరమా? అని ప్రశ్నించారు. ఎవరైనా చనిపోతే సంతాప దినాలు చేస్తారు కానీ.. పుట్టినరోజుకు కాదన్నారు. కేసీఆర్‌ను రోడ్డు మీదకు లాగే వరకు విశ్రమించబోమన్న రేవంత్.. ఎంతమంది పోలీసులను పెట్టినా నిరసన తెలిపి తీరుతామన్నారు.కేసీఆర్‌ జన్మదినం.. ప్రతిపక్షాలకు జైలు దినం కావాలా? అని ప్రశ్నించారు. విపక్షనేతలను అరెస్ట్‌ చేసి మంత్రి కేటీఆర్‌ తన తండ్రికి నజరానా ఇవ్వాలనుకున్నారా? అని నిలదీశారు. కేసీఆర్‌ జన్మదినం నిరుద్యోగుల ఖర్మదినంగా మారిందన్నారు.