- కంపెనీపై వార్తలు రాయకుండా ఆదేశాలు
- ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
- హైకోర్టు తీర్పును సమర్థించిన బెంచ్
- పరువునష్టం వ్యవహారంపై రెండేండ్లలోపు
- విచారణ జరపాలని ట్రయల్ కోర్టుకు ఆదేశం
న్యూఢిల్లీ, వెలుగు: వీ6 వెలుగు, ఇతర మీడియా సంస్థలపై మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తమ కంపెనీకి వ్యతిరేకంగా వార్తలు రాయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న మేఘా కంపెనీ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. మేఘా కంపెనీకి అనుకూలంగా కూకట్‌పల్లి ట్రయల్ కోర్టు జారీ చేసిన మధ్యంతర ‘మీడియా గ్యాగ్ ఆర్డర్’ను పక్కనపెడుతూ, హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అయితే పరువు నష్టం వ్యవహారంపై మాత్రం విచారణను రెండేండ్లలోపు పూర్తి చేయాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. వీ6 వెలుగు, విల్ మీడియా, ఇతర మీడియా సంస్థలు తమకు వ్యతిరేకంగా, పరువు నష్టం కలిగించేలా వార్తలు ప్రచురిస్తున్నాయని.. ఆయా సంస్థలు అలాంటి వార్తలు రాయకుండా ఆదేశాలు ఇవ్వాలని కూకట్‌పల్లి కోర్టును మేఘా కంపెనీ మొదట ఆశ్రయించింది. దీనిపై ట్రయల్ కోర్టు విచారణ జరిపి.. మేఘాకు అనుకూలంగా ‘మీడియా గ్యాగ్ ఆర్డర్’ ఇచ్చింది. అయితే దాన్ని సవాల్ చేస్తూ మీడియా సంస్థలు హైకోర్టులో పిటిషన్ వేశాయి. దానిపై విచారణ జరిపిన హైకోర్టు... మీడియా గ్యాగ్ ఆర్డర్‌ను తొలగిస్తూ ఈ ఏడాది మే 28న ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ క్రమంలో మేఘా కంపెనీ ఈ ఏడాది అక్టోబర్ 25న హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఇందులో వీ6 వెలుగు, విల్ మీడియా, ఇతర మీడియా సంస్థలను ప్రతివాదులుగా చేర్చింది. ఈ స్పెషల్ లీవ్ పిటిషన్‌పై గురువారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు అడ్వకేట్లు వాదిస్తూ... తమ కంపెనీపై వార్తలు రాయకుండా మీడియా సంస్థలను నిరోధించాలని కోరారు. అయితే ‘మీడియా గ్యాగ్ ఆర్డర్’ను కొనసాగించేందుకు బెంచ్ నిరాకరించింది. ఈ విషయంలో హైకోర్టు తీర్పుతో ఏకీభవిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా, తమ కంపెనీ అవినీతికి పాల్పడినట్టు పలు మీడియా సంస్థలు వార్తలు, స్టోరీలు, ఆర్టికల్స్ ప్రచురించాయని.. తమకు పరువునష్టం కలిగించాయని కూకట్‌పల్లి కోర్టులో మేఘా దావా దాఖలు చేసింది. అలాగే తమ కంపెనీకి వ్యతిరేకంగా వార్తలు రాయకుండా మీడియాపై నిషేధం విధించాలని కోరింది. అయితే వార్తలు రాయకుండా మీడియా సంస్థలను నిషేధించాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చిన సుప్రీం.. పరువునష్టం అంశంపై మాత్రం విచారణ జరపాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది.
