- ఫేక్ బెదిరింపుగా తేల్చిన ఆఫీసర్లు
హనుమకొండ, వెలుగు: వరంగల్ డిస్ట్రిక్ట్ కోర్టు కాంప్లెక్స్‌కు మరోసారి బాంబు బెదిరింపు మెసేజ్ రావడం కలకలం రేపింది. జూన్‌లో ఇలాగే బాంబు బెదిరింపు రాగా.. గురువారం సైతం వరంగల్ జిల్లా జడ్జి మెయిల్‌కు మెసేజ్ వచ్చింది. జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆరు ఆర్డీఎస్ బాంబులను అమర్చారని, మధ్యాహ్నం 2 గంటల్లోగా అందరూ ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆ మెయిల్‌లో పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన కోర్టు సిబ్బంది వెంటనే వరంగల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కమిషనరేట్ బాంబ్ స్క్వాడ్ సిబ్బంది హుటాహుటిన కోర్టు కాంప్లెక్స్ వద్దకు చేరుకొని తనిఖీలు చేపట్టారు. ఎక్కడా అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో ఫేక్ మెయిల్‌గా తేల్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
